‘బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ అవడం తప్పేం కాదే’..నయనతార
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార తాజాగా హీరో ధనుష్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ‘నేను రౌడీనే’ అనే చిత్రానికి దర్శకుడు ఆమె భర్త విఘ్నేష్. ఈ చిత్రంలో పనిచేస్తున్న సమయంలోనే నయనతారకు విఘ్నేష్‌కు మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న ధనుష్ ఆమెకు ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాడు. ఆమె పెళ్లి, సినీ జీవితానికి సంబంధించిన విశేషాలతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార- బియాండ్ ద ఫెయిరీ టేల్’ పేరుతో డాక్యుమెంటరీ తీసింది. ఈనెల 18న దానిని రిలీజ్ చేయబోతున్నారు. తన జీవితంలో పెళ్లి విషయంలో ప్రముఖపాత్ర వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మూవీ బిట్స్ కావాలని నయనతార కోరగా, ధనుష్ అంగీకరించలేదు. అయితే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఈ చిత్ర షూటింగులో ఆమె మొబైల్‌లో తీసుకున్న వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా ఈ క్లిప్స్ ఉపయోగించడంపై సీరియస్ అయిన ధనుష్ ఆమెకు రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ కాపీరైట్ యాక్ట్ ప్రకారం లీగల్ నోటీసులు పంపించాడు. దానితో మండి పడిన నయనతార ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీరంగంలో స్టార్‌గా ఎదిగానని, తండ్రి, సోదరుడి సపోర్టుతో వచ్చిన ధనుష్ తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. అభిమానుల ముందు ఒకలా, బయట మరోలా నటిస్తున్నావని దుమ్మెత్తి పోసింది.

