మెడికల్ కాలేజీల టెండర్లు రద్దు చేయడం ఎవరి తరము కాదు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వంద పడకల ఏరియా ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి సత్యకుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తురకపాలెంలో అనారోగ్య సమస్యలు, పలువురి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించిందని స్పష్టంచేశారు. అక్కడి ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, నివేదికలు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై సత్యకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వైద్యకళాశాల భవన నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలు నిర్మించకపోవడంతో వేలాది మెడికల్ సీట్లు విద్యార్థుల చేతుల్లోంచి జారిపోయాయని, లక్షలాది మందికి వైద్య సేవలు అందలేదని ఆయన మండిపడ్డారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఆరోపించిన సత్యకుమార్, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణ టెండర్లను రద్దు చేస్తానని జగన్ ప్రకటించడం దారుణమని, అలా రద్దు చేయడం ఎవరి తరమూ కాదని అన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూనే, వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను మంత్రి సత్యకుమార్ మరోసారి ఎండగట్టారు.

