Breaking NewsHome Page SliderTelangana

అది ఫాం హౌజ్ కాదు….

ఫాంహౌస్​లో కోడిపందేల వ్యవహారం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగున్నర గంటల పాటు వివిధ అంశాలపై శ్రీనివాసరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్​ సీఐ పవన్​ కుమార్​ రెడ్డిలు విచారించారు.పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డితో పాటు లాయర్​, ఫాంహౌజ్​ లీజుకు తీసుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్​ వద్దకు వచ్చినప్పటికీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. కేవలం శ్రీనివాస్​ రెడ్డిని మాత్రమే అనుమతించి విచారించారు. పోలీసుల విచారణ అనంతరం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరైనట్లుగా వివరించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు చేసిన ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. తొల్కట్టలో ఉన్నది ఫాం​హౌస్‌ కాదని, తోట అని, రెండు గదులు మాత్రమేనని ఆయన తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎలాంటి మచ్చలేకుండా ప్రజా సేవలో నిమగ్నమైనట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి లీగల్‌ నోటీసులను పంపిస్తానని స్ప‌ష్టం చేశారు.