‘ఇది నాకే ఎక్కువ బాధాకరం’..జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ వీడియో
‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తనకు అభిమానుల కంటే కూడా ఎంతో బాధాకరంగా ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తాను అభిమానులతో ఎప్పుడు గడిపే సమయం వస్తుందా అంటూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటానని, కానీ దురదృష్టవశాత్తూ ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంటుకు ఉప్పెనలా అభిమానులు చేరడం, అద్దాలు పగులకొట్టడం వంటి చర్యల వల్ల భద్రతకు ముప్పు కలుగుతుందని భావించి ఈవెంట్‌ను రద్దు చేశారు నిర్వాహకులు. ఈవెంట్ జరగకపోవడంపై ఆయన స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దేవర సినిమా గురించి, దానికోసం తాను పడిన కష్టం గురించి అభిమానులతో పంచుకోవాలని ఎంతో ఆశగా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూసానని, కానీ ఇది రద్దు అవడంతో తాను కూడా అభిమానుల కంటే ఎక్కువగా బాధపడుతున్నానని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈవెంట్ ఆర్గనైజర్స్‌ను కానీ, నిర్మాతలను కానీ తప్పు పట్టలేమన్నారు. ఇప్పుడు కలవకపోయినా, సెప్టెంబర్ 27న చిత్రంలో కలుద్దామని, చిత్రం చూసి మీరంతా ఆనందిస్తారని నేను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, మీ ఆశీర్వాదం చిత్రయూనిట్ అందరికీ ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

