Home Page SliderTelangana

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోవడం సిగ్గుచేటు..అక్బరుద్దీన్

నేడు తెలంగాణ అసెంబ్లీలో మొదటి రోజే పార్టీల మధ్య హీట్ వార్ నడిచింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎంఐఎం పార్టీ కూడా మాటల తూటాలు పేల్చింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ ముస్లింలకు అసెంబ్లీలో తగిన స్థానం కల్పించకపోవడం దురదృష్టకరం అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎన్నికలలో గెలిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. 12 శాతం మైనారిటీ రిజర్వేషన్లను ఏ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోలేకపోతోందన్నారు. ముస్లింలకు 12 వేలు కాదు, 15 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు 2 లక్షల కోట్ల రూపాయల పై చిలుకే ఖర్చవుతుందని పేర్కొన్నారు. తక్షణమే ఆరు గ్యారెంటీలను అమలు చేసి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం కంటే మేలుగా పాలించడానికి ప్రయత్నించాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు విషయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. తమ పార్టీకి ఏ ఇతర పార్టీలతో పొత్తు లేదని స్పష్టం చేశారు.