Home Page SliderNational

కర్ణాటక ప్రభుత్వంపై మరోసారి ఐటీ ఉద్యోగులు నిరసన

కర్ణాటక ప్రభుత్వం ఏదో ఒక ప్రతిపాదనలతో చిక్కుల్లో పడుతోంది. ఈ మధ్యనే ఐటీ, ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదన చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని వేళలు పెంచాలనే ప్రతిపాదన చేసి, కార్మిక సంఘాలు, ఐటీ ఉద్యోగుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. పని గంటలు పెంచాలనే ప్రతిపాదనపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1961లో మార్పులు చేస్తామని ప్రభుత్వం పేర్కొనగా, ట్రేడ్ యూనియన్లు మండిపడుతున్నాయి. ఐటీ సేవల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కార్మిక మంత్రిని కలిసి, తమ నిరసన వ్యక్తం చేశారు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఐటీ లేదా బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 12 గంటలు మించి పని చేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్టంగా 14 గంటల వరకూ పని చేయవచ్చు. ప్రస్తుతం గరిష్టంగా 10 గంటలు మాత్రమే పని చేయడానికి అనుమతి ఉంది. కానీ మూడు నెలలో 125 గంటలకు మించి అనుమతి లేదు. అయితే ఇంకా బిల్లును ప్రవేశపెట్టలేదని, చర్చలు నడుస్తున్నాయని కార్మిక మంత్రి మీడియాతో పేర్కొన్నారు. కార్మిక చట్టాల ప్రకారం 48 గంటలకు మించి పని చేయించకూడదు. దీనివల్ల ఉద్యోగులు మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.