గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తోన్న బాంబుల వర్షంతో భారీగా ప్రాణనష్టం
గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తోన్న బాంబుల వర్షంతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య పోరుతో గాజా వాసులు అల్లాడుతున్నారు. దక్షిణ గాజాలో కూడా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఇప్పుడు అక్కడి ప్రజలకు కూడా సురక్షిత స్థానమంటూ లేకుండా పోయింది. ఫలితంగా వేల సంఖ్యలో మరణాలు నిత్యం సంభవిస్తున్నాయి. కచ్చితత్వం లేని డంబ్ బాంబులను అధికంగా వాడటం కూడా ఇందుకు కారణం కావచ్చని అమెరికా నిఘా సంస్థ నివేదిక అంచనా వేసింది. దీనిని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం రూపొందించిందని సీఎన్‌ఎన్ కథనంలో పేర్కొంది.
ఒకవైపు హమాస్ ప్రతిఘటన కూడా తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో ఇజ్రాయెల్ ఒకేసారి తొమ్మిది మంది సైనికులను కోల్పోయింది. ఇది ఐడీఎఫ్‌కు పెద్ద ఎదురుదెబ్బే. దీంతో ఇప్పటిదాకా 115 మంది ఇజ్రాయెల్ సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాకు చెందిన సుమారు 18 వేల మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.


 
							 
							