Home Page SliderInternational

ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని వీడియో సందేశం

ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వీడియో సందేశం విడుదల చేశారు. ఈ వీడియోలో ఇరాన్‌లోని ప్రజలకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన, ఇరాన్ ప్రభుత్వానికి మాత్రం గట్టిగా హెచ్చరికలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ నిరంకుశపాలనను అంతం చేస్తామని, త్వరలోనే ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామని వెల్లడించారు.

ఈ వీడియోలో ప్రజలనుద్దేశించి “మీ పాలకులు గాజా, లెబనాన్‌ను రక్షించడానికి ప్రయత్నిస్తూ మిమ్మల్ని అణచివేస్తున్నారని మీకు తెలుసు. వారు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదు. కోట్లాది రూపాయలను యుద్ధాల కోసం వెచ్చిస్తున్నారు. మీ పిల్లల చదువు, ఆరోగ్యం, దేశ మౌలికవసతుల అభివృద్ధి కోసం ప్రయత్నించడం లేదు. మీ దేశంలో హెజ్‌బొల్లాకు చెందిన హంతకులు, అత్యాచారాలు చేసే వారని సమర్థించకండి. మీ పాలకులు వారి చేతుల్లో కీలుబొమ్మలుగా తయారయ్యారు. మేము మా ప్రజలను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం. త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుండి మీకు విముక్తి కలిగించి,ఇరాన్, ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొల్పుతాం” అని పేర్కొన్నారు.

హమాస్‌తో యుద్ధంతో మొదలైన ఇజ్రాయెల్ యుద్ధాలు ఇప్పుడు మరింత విస్తరించి హెజ్‌బొల్లాపై దృష్టి పెట్టింది. ఇప్పటికే హెజ్‌బొల్లా సంస్థ అధినేత నస్రల్లాను అంతమొందించింది. ఇప్పుడు లెబనాన్ సరిహద్దుల్లో పరిమిత స్థాయిలో భూతల దాడులు మొదలుపెట్టింది. హెజ్‌బొల్లాకు ఇరాన్ మద్దతు ఉండడంతో ఇజ్రాయెల్ ప్రధాని ఇలా ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అక్కడి దేశాలను వణికిస్తున్నాయి. మారణకాండ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.