Home Page SliderInternationalviral

ఇరాన్ సుప్రీం లీడర్ నివాస సమీపంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులు..!

పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులతో పశ్చిమాసియా బేంబేలెత్తుతుంది. ప్రజలు భయం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా చేసుకుని గత శుక్రవారం రాత్రి నుంచి దాడులకు తెగబడింది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగడంతో ప్రజా జీవనానికి ఆటంకంగా మారిపోయింది. ఈ క్రమంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ నివాసముంటున్న సమీపంలో వైమానిక దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడంతో సంచలనానికి దారితీసింది. టెహ్రాన్‌ లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని స్థానిక మీడియా ఓ విడియోను విడుదల చేయడంతో బహిర్గతం అయింది.
మిలిటరీ చీఫ్‌గా అమీర్‌ హతామీ..
ఇరాన్‌ మిలిటరీ చీఫ్‌గా అమీర్‌ హతామీని నియమించినట్లు ఖమేనీ తెలిపారు. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మిలిటరీ చీఫ్‌ మహమ్మద్‌ బాఘేరి మృతి చెందడంతో హతామీ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. హతామీ 2013 నుంచి 2023 వరకు ఇరాన్ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆపరేషన్‌ ‘రైజింగ్‌ లయన్‌’ పేరుతో ఇరాన్‌ పై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే టార్గెట్ గా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్‌ లోని పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను ఇరాన్ కోల్పోవలసివచ్చింది. దీనికి టెహ్రాన్‌ ప్రతిదాడులను కూడా చేసింది. టెల్‌ అవీవ్‌ చేసిన దాడుల్లో 78 మంది ఇరాన్‌ పౌరులు మృతి చెందగా.. 329 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.