ఇది ప్రభుత్వ చేతకానితనం కాదా?
తిరుమలలో ఎన్నో ఏళ్ల నుండి ప్రతీ ఏటా వైకుంఠ ఏకాదశి జరుగుతోంది. ప్రతీ సంవత్సరం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఈ పది రోజుల పాటు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఎన్నడూ లేని భారీ ప్రమాదం ఇప్పుడెందుకు జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ చేతకానితనమేనని దుమ్మెత్తి పోస్తున్నారు. తిరుపతిలో 90 కౌంటర్లు ఏర్పాటు చేసినా, ఇలాంటి తొక్కిసలాట జరిగిందంటే ఇది కేవలం పర్యవేక్షణా లోపమే. బైరాగి పట్టెడ దగ్గర ఒక్కసారిగా భక్తులు తోసుకురావడానికి కారణం తగిన భద్రతా సిబ్బంది ఏర్పాటు చేయకపోవడమే. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ టెక్నాలజీ వాడుతున్నామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ దర్శనాలు ఎందుకు ఆన్‌లైన్‌లో ఇవ్వకుండా, ఇన్ని లక్షల మందిని గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గురువారం ఉదయం నుండి వైకుంఠ దర్శన టిక్కెట్లు ఇస్తామని ప్రచారం జరగడంతో బుధవారమే కర్ణాటక, తమిళనాడుల నుండి వేల సంఖ్యలో వచ్చేశారు. వారందరినీ పార్కులో పెట్టి, కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదు అధికారులు. టీటీడీ పాలక మండలి ఏం చేస్తోందన్నది ప్రశ్నగా మారింది.