కేసీఆర్ బంగారు తెలంగాణ ఇదేనా..?
మునుగోడు నుంచి పగిడిపల్లికి మూడున్నర గంటలు
బంగారు తెలంగాణాలో రోడ్లు ఇంత అధ్వాన్నమా..?
మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా
మునుగోడు తీర్పు తెలంగాణ భవిష్యత్తుకు నాంది: ఈటల
గత 20 ఏళ్లలో కేసీఆర్‌తో పెట్టుకొని బతికి బట్ట కట్టింది తానొక్కడినే అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామంలో సంకినేని వెంకటేశ్వర్లు, విజయేందర్ రెడ్డితో కలిసి ఈటల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ వల్లె వేస్తున్న బంగారు తెలంగాణ దుస్థితి ఏంటో మునుగోడుకు వస్తే తెలుస్తుందన్నారు. మునుగోడు నుంచి పగిడిపల్లికి వచ్చేందుకు మూడున్నర గంటలు పట్టిందని, బంగారు తెలంగాణాలో మన రోడ్లు అంత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి రోడ్లను 30 ఏళ్ల క్రితం చూశామన్నారు. కేసీఆర్ మెడలు వంచి అయినా సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని.. పెన్షన్ ఆపడానికి వారి అబ్బ జాగీరు కాదని స్పష్టం చేశారు.

మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా..
‘కరోనా సమయంలో కూడా బయటికి వచ్చి ప్రజలను ఓదార్చే ధైర్యం చేయని సీఎం కేసీఆర్ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొంతు నొక్కేందుకు స్వయంగా వస్తున్నారట. లెంకలపల్లిలో కుర్చీ వేసుకొని కూర్చొని మరీ రాజగోపాల్ రెడ్డిని ఓడిస్తారట’ అని ఈటల ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని.. ఆ రాజీనామా వల్లే 16 మంది మంత్రులు, 81 మంది ఎమ్మెల్యేలు మునుగోడులో తిష్ట వేశారని ఈటల గుర్తు చేశారు. గట్టుప్పల్ మండలం వచ్చిందని, 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయని.. దీంతో రాజగోపాల్ జీవితం ధన్యమైందన్నారు.

కేసీఆర్ అహంకారాన్ని అణిచేసేందుకే ఈ ఎన్నిక..
కేంద్రం డబ్బులిస్తున్నా డబుల్ బెడ్ రూం కట్టలేని సన్నాసి కేసీఆర్ అని ఈటల విరుచుకుపడ్డారు. అబద్ధాల కోరు.. మాటలతో వంచించి ప్రజలను మోసం చేసే వ్యక్తి కేసీఆర్ అన్నారు. మోసం చేసే వారికి బుద్ధి చెప్పేందుకే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోందన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా చేశారని.. ఆయన గెలిస్తే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి ఏమీ రాదని.. కేసీఆర్ అహంకారం మాత్రం అణుగుతుందని ఈటల వివరించారు. మునుగోడులో గెలిచేది ఒక వ్యక్తి కాదని.. 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవం అని చెప్పారు.

విమానం కొనేందుకు కేసీఆర్‌కు డబ్బులెక్కడివి..?
కేసీఆర్ విమానాలు ఎలా కొంటున్నారని.. ఆయనకు ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయని ఈటల ప్రశ్నించారు. మునుగోడులో ఓట్లు కూడా కొనడానికి వస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ వాళ్లు ఎన్ని డబ్బులిచ్చినా తీసుకోవాలని.. ఓటు మాత్రం రాజగోపాల్ రెడ్డికే వేయాలని కోరారు. తాను మాటలు చెప్పి ఓట్లు వేసుకుని వెళ్లిపోయేందుకు రాలేదని.. మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తుకు నాంది అనే విషయాన్ని గుర్తు చేసేందుకే వచ్చానన్నారు. ఇంతటి పెద్ద బాధ్యతను మునుగోడు ప్రజల చేతుల్లో పెట్టి వెళ్తున్నామని ఈటల స్పష్టం చేశారు.

