NewsTelangana

సిట్ పేరుతో కొత్త డ్రామాలా?

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రభుత్వం తరచూ విచారణలు, కమిషన్లు, సిట్‌ల పేరిట ‘అటెన్షన్ డైవర్షన్’ డ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఫోటోల మార్ఫింగ్, మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారాల కేసుల విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మంగళవారం స్పందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పీఏలు, మంత్రుల కుమారులు, ఏఐసీసీ సెక్రటరీలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా ఎందుకు సిట్‌లు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే ఓ టీవీ ఛానెల్, రాష్ట్ర మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని ‘ఉటంకించిన’ పాపానికి డిజిటల్ మీడియా హ్యాండిల్స్, ఇతర ఛానెళ్లపై దర్యాప్తుకు సిట్ వేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

“వార్త వేసిన ప్రధాన ఛానెల్‌పై చర్యలు తీసుకోకుండా, సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకు? ఎవరిని కాపాడటానికి? ఎవరిని వేటాడడానికి ఈ ప్రయత్నం?” అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు ప్రభుత్వ ఓవరాక్షన్‌ను గమనిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలపై వేధింపులు ఆపకపోతే తగిన గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.