ఆంధ్రప్రదేశ్-గుజరాత్ కాదా? తిరుపతి లడ్డూల విషయంలో టీడీపీ వ్యూహం వర్కౌటవుతోందా?
లడ్డూ రాజకీయం తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏం జరుగుతుందన్నదానిపై జాతీయ స్థాయిలో రసవత్తర చర్చ సాగుతోంది. అసలు తిరుమలలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలని శ్రీవారిని కొలిచే భక్తుల ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. స్వామి అంటే భయం, భక్తి రెండూ ఉంటాయి. శ్రీవేంకటేశ్వరుని ప్రసాదంలో కల్తీ కలపడానికి, నెయ్యి విషయంలో జంతువుల కొవ్వు వినియోగించే పరిస్థితి ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ ప్రభావం ఉండొద్దని పెద్ద ఎత్తున కొందరు ప్రయత్నించారు. జగన్ అప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకునేలా పరిస్థితులు వచ్చాయ్. ఆ తర్వాత సీబీఐ, ఈడీ కేసులు, జగన్ జైలుకు వెళ్లిరావడం ఇవన్నీ జరిగిపోయాయ్. 2014లో రాష్ట్ర విభజన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కావడం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉండటం, తిరిగి ఐదేళ్లకు జగన్ సీఎం కావడం, చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం జరిగిపోయాయి. భూమి గుండ్రంగా ఉంటుందన్న చందంగా నాడు బీజేపీతో సన్నిహితంగా ఉండి జగన్ అధికారంలోకి వస్తే, తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా జీరో చేయాలని చేయని ప్రయత్నం లేదు. మొదట్నుంచి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యం పనిచేస్తూనే ఉంది. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక జగన్ అనుసరిస్తున్న తప్పులు కూడా, ఈ రోజున్న పరిస్థితి కారణమన్న భావన ఉంది. తాజాగా జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకి అన్న భావనను ప్రచారం చేసేందుకు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

ఏ రాజకీయ నాయకుడు సాధువు కాడు. దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు ఎన్నో చూశారు. ఎంతో చూశారు. రాజశేఖర్ రెడ్డితో పోరాడారు. జగన్‌ను ఢీకొట్టారు. తెలంగాణ రాజకీయాలను చూశారు. తాజాగా తిరుమల-తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్న రాజకీయం, ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. కాదు కాదు దేశ వ్యాప్తంగా రచ్చ సాగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయంగానూ చర్చ జరుగుతోంది. ఏపీలో అసలే కూటమి సర్కారు. తోడుగా బీజేపీ, జనసేన పార్టీలున్నాయి. హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న బీజేపీ యాంటీ హిందూ వ్యవహారాలను మరింతగా తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే తమకు ఏపీలో వైసీపీని తొక్కి నార తీయడానికి ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావించింది. ఇక జగన్మహోన్ రెడ్డిని డిఫేమ్ చేస్తే తమకు తిరుగుండదనుకుంది. అందుకే టీడీపీ ఎమ్మె్ల్యేల సమావేశంలో చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం ఎవరైనా చేసే పనే. తిరుమల లాంటి పవిత్రమైన విషయంలో ఎవరూ కూడా రాజకీయాలు చేయడానికి ధైర్యం చేయరు. సో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయన్న భావన ప్రజల్లో వ్యక్తమైంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అలా ఇలా అని చెప్పడానికి కూడా చాలా మంది వెనకాడరు. క్రిస్టియన్ కాబట్టి అలా చేశాడని అనేవారు కూడా ఉన్నారు.

మొత్తం వ్యవహారంపై జగన్ నేరుగా స్పందించడం, చంద్రబాబు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని చూశాం. ఐతే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకిలా జరిగిందని అందరూ ఆలోచిస్తు్న్నారు. వైసీపీ అధికారానికి దూరమై వంద రోజులైంది. వేడుకను కూటమి సర్కార్ ఘనంగా జరుపుకొంది. రాజకీయం చేయడానికి కొన్ని అంశాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తానని చెప్పి, ఆ మాట తప్పినప్పుడు వాటిని ప్రతిపక్షాలు లేవనెత్తతూ రాజకీయ లబ్ది పొందడం సర్వసాధారణమైన విషయం. కానీ రాజకీయాలతో చలికాచుకుంటున్న ప్రస్తుత తరుణంలో మతవిశ్వాశాలను దెబ్బకొట్టారన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎలాంటి రుజువులు లేకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద మత విశ్వాసాలకు కేంద్ర బిందువుగా ఉన్న తిరుపతి విషయంలో ఇలా జరగడమేంటని అందరూ లబోదిబోమంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అండతో కొందరు ఎర్ర చందనమో, లేదంటే ఇంకేదైనా అక్రమాలకు పాల్పడితే, అది పుష్ప సినిమాలో చూపించినట్టుగా గానీ ఉంటే ఆ కథ వేరేగా ఉండేది. కానీ మొత్తం వ్యవహారం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారన్నది, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ThePrint కథనం ప్రకారం సెప్టెంబరు 21న పేర్కొన్నట్టుగా, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన తర్వాత కల్తీ నెయ్యి జూలై 6-12 మధ్య ఆలయానికి వచ్చిందని, టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీలో కలుషితమైనట్లు అనుమానించబడిన నెయ్యి ఎప్పుడూ ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. కానీ అసలేం జరిగిందన్నది మనందరం వింటున్నదే. అనుమానాస్పద కొవ్వు కంటైనర్లను రుచి పరీక్షలో విఫలమయ్యాక సరఫరాదారుకి తిరిగి ఇచ్చేశారు. తిరస్కరించిన స్టాక్ నుండి నమూనాలను తనిఖీ కోసం ప్రత్యేక ప్రయోగశాలకు పంపారు. తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతు కొవ్వును జగన్ ప్రభుత్వం ఉపయోగించిందని సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ చెప్పారు. కోట్లాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను జగన్ సర్కారు గౌరవించలేదని, ఇది వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. ఇక మొత్తం వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగించాయి. రాహుల్ గాంధీ క్రైస్తవ మతానికి మద్దతుగా ఉన్నాడన్న ప్రచారాన్ని కొందరు గత పదేళ్లుగా విన్పిస్తూ వచ్చారు. అదే పరిస్థితి ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కలిగింది. కానీ రాహుల్, జగన్ వేరు వేరు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం వ్యవహారం నుంచి రాహుల్ తనను తాను ప్రూవ్ చేసుకోడానికి తాను శివభక్తుడనని చెప్పుకోవాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి పరిస్థితి తెచ్చుకోలేదు.

రాజశేఖరరెడ్డి క్రైస్తవుడైనందున ఆయనను నాయకుడిగా అంగీకరించడానికి ఎవరూ నిరాకరించలేదు. వాస్తవానికి వైఎస్సార్ అన్ని మతాల ప్రజలతో కలిసిపోయాడు. విదేశీ టూర్ల తర్వాత వైఎస్సార్ తిరుమల వచ్చేవాడంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్సార్ మరణం వరకు ఆయన క్రిస్టియన్ ఆచరిస్తాడని కూడా చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యం కలగకమానదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా వ్యవహరించినా ఎప్పుడూ తన హద్దుల్లో ఉండేవారంటారు. కానీ జగన్ అలా కాదన్న భావన ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డిని హిందువులకు దూరం చేసిందంటారు. రాజకీయం చేయడంతోపాటుగా, ప్రత్యర్థుల విషయంలో వేట దారుణమని కొందరు చెప్తారు. చంద్రబాబును అకారణంగా వేధించారన్న భావన ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబుకు ఒళ్ళు మండిపోయేలా చేశాయంటారు. అయితే ఏ అవమానమూ జగన్‌ను సంతృప్తి పరిచలేదు. చివరగా జైలుకు పంపించారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అందుకే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే వైఎస్ జగన్ పాలనలో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే, చంద్రబాబు ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయ్. జగన్మోహన్ రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధించడమా లేదంటే వైసీపీని నిర్వీర్యం చేయడమా అన్నది ఆలోచించాలి. 2014 నుండి 2019 వరకు విభజన జరిగిన ఆంధ్రరాష్ట్ర తొలిసారి ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో జగన్‌తో నేరుగా మాట్లాడేందుకు ఆహ్వానించాలని చంద్రబాబుకు కోరారట. మీ నాన్న-నేను రాజకీయ ప్రత్యర్థులం కానీ శత్రువుల కామన్నది జగన్‌కు వివరించాలని చెప్పారట. కానీ ఆ సలహాను చంద్రబాబు తిరస్కరించాడంటారు. జగన్‌కు ఆదరణ పెరుగుతున్నా, అంత సీన్ లేదన్న భావనను కలిగించారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఓడించారు. జగన్‌ను హిందూమతానికి శత్రువని దుమ్మెత్తిపోసే ఈ ప్రయత్నం ఎటువైపునకు దారితీస్తుందో చూడాలి. ఇది ఒక వింత. ప్రమాదకరమైన నిర్లక్ష్యపూరితమైనది. ఆలయ ట్రస్ట్ బోర్డులో ఉన్న ఒకరి భార్య బైబిల్ కాపీతో కనిపించిందని చంద్రబాబు చెప్పడం విశేషం. చంద్రబాబు మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం సబబుకాదన్న భావన ఉంది. బయట నుంచి మాత్రం దీనిపై కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తుంటే ఏపీలో కూటమి నేతలు చలికాచుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తు్న్నారు. కూటమిలోని మరో మిత్రపక్షం జనసేనాని ఎలా ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి బలమైన రాజకీయ పునాది ఉంది. ఆంధ్ర ప్రదేశ్ గుజరాత్ కాదు, అదే పార్టీ, లేదా నాయకుడి వద్ద ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. తెలంగాణలో ప్రజలు రెండు టర్మ్స్ తర్వాత పాలకులను మార్చినా ఏపీలో మాత్రం ఓటర్లు ఐదేళ్లకొకరిని మార్చేస్తున్నారు.