నేటి తరానికి శ్రీ తేజ్ ఆదర్శమా..తప్పెవరిది?
‘పుష్ప-2’ చిత్రం ప్రీమియర్ షోలో అల్లు అర్జున్‌ను చూడడానికి వెళ్లి తొక్కిసలాట ఘటనలో ప్రాణం మీదకు తెచ్చుకున్నారు ఒక కుటుంబం. రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య పోరాడుతుండడం మనకు తెలిసిందే. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేయడం హీరో అల్లు అర్జున్ అరెస్టు కావడం, బెయిల్‌పై విడుదల కావడం వంటి ఘటనలు చకచకా జరిగిపోయాయి. వీటన్నింటినీ ఆలోచిస్తే నేటి పిల్లలు, యువత తప్పుదోవ పట్టడానికి కారణం ఎవరనేది ఆలోచించాల్సిన విషయం.

హాస్పటల్లో ఉన్న శ్రీతేజ్ తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి. “మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. ‘పుష్ప’-1 సినిమా చాలా సార్లు చూశాడు. మేము వాడిని ‘పుష్ప’ అని పిలుస్తాము. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము. పుష్ప సినిమా మీద రీల్స్ కూడా చేశాడు”. ఆయన మాటలు వింటుంటే ఏమనిపిస్తోంది? ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. ఒక సినిమా యాక్టర్‌కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ…ఇక్కడ మనం అర్థం చేసుకుంటే…ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్‌కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ‘పుష్ప… పుష్ప’ అని పిలిచారు. చిన్న పిల్లలు చిన్న మొక్కలలాంటి వారు. వారి మెదడు మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది. వారిని మంచికి అలవాటు చేయాలి. తల్లిదండ్రులు ‘అమరన్’ లాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి ప్రీమియర్ షోలకు లేచి వెళ్ళరు? ఇంట్లో పిల్లల్ని ‘పుష్ప’ అని ఎందుకు పిలుస్తారు ‘ముకుంద్’ అని ఎందుకు పిలవరు? మేజర్ ముకుంద్ గురించి తెలుసుకుంటే, అలాంటి సినిమాకు తీసుకెళ్తే హీరో అంటే మేజర్ ముకుంద్‌లా పోరాడేవాడు అని పిల్లలు తెలుసుకుంటారు కదా?

“సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం, స్మగ్లింగ్ చేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?”, అంటూ మాట్లాడితే… పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. ఇంట్లో “ఫ్యాన్” అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్‌కి కాదు. క్యారెక్టర్‌కి. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ దానిలో మంచి, చెడుల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.