మళ్లీ ‘కమలం’ గూటికే రాజాసింగ్?
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్ తిరిగి సొంత గూటికి చేరబోతున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేసిన ఆయన, ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ వేదికగా అగ్రనేతలతో జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయని, వచ్చే నెలలోనే ఆయన రీ-జాయినింగ్ ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రాజాసింగ్, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌తో పాటు పలువురు కీలక నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి తన పునరాగమనంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్‌కు ఉన్న వ్యక్తిగత పట్టు, హిందుత్వవాదిగా ఆయనకున్న క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం.. ఆయన రాకకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
తగ్గని విధేయత.. పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ పట్ల తన విధేయతను రాజాసింగ్ పలుమార్లు చాటుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను.. హిందుత్వమే నా అజెండా” అని స్పష్టం చేయడం ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారనే సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చింది. నియోజకవర్గంలో ఆయనకున్న బలమైన ఓటు బ్యాంక్ దృష్ట్యా, వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీ అభ్యర్థిగానే రాజాసింగ్ బరిలోకి దిగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

