Breaking Newshome page sliderHome Page SliderInternational

ట్రంప్ ‘పవర్ ప్లే’పై పుతిన్ మౌనరాగం ?

ప్రపంచంలో అమెరికా ఎక్కడైనా దురాక్రమణ చర్యలకు పాల్పడితే, క్రెమ్లిన్‌ నుంచి వెంటనే తీవ్ర స్థాయిలో స్పందన వచ్చేది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వరుస ‘పవర్ ప్లే’ చర్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశ్చర్యకరంగా మౌనం పాటిస్తున్నారు. హెచ్చరికలు, ప్రతీకార బెదిరింపులు, సైనిక విన్యాసాలు సాధారణమే. కానీ 2026 ప్రారంభం నుంచి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. వెనెజువెలా నేత నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడం, రష్యా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడం, గ్రీన్‌లాండ్‌ను ఆక్రమిస్తామని ట్రంప్ బహిరంగంగా బెదిరించడం వంటి ఘటనలు జరిగినప్పటికీ, రష్యా నుంచి ఘాటు ప్రతిస్పందన లేకపోవడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అమెరికా ఆధిపత్యాన్ని సమతుల్యం చేయాలనే ఉద్దేశంతో వెనెజువెలా, ఆర్కిటిక్ ప్రాంతాల్లో రష్యా దశాబ్దాలుగా భారీగా పెట్టుబడులు పెట్టింది. అయినప్పటికీ మదురోను అరెస్టు చేసిన అంశంపై పుతిన్ ఇప్పటివరకు ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆయన జనవరి 6న ఆర్థోడాక్స్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంలో మాత్రమే బహిరంగంగా కనిపించారు. ఆయన అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌, ప్రభుత్వ టీవీ చానళ్లు కూడా ఈ వ్యవహారంపై మౌనం పాటించడం గమనార్హం.
ఈ మౌనానికి ప్రధాన కారణం యుక్రెయిన్‌ అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. యుక్రెయిన్‌ విషయంలో అమెరికాతో సాగుతున్న సున్నితమైన చర్చలకు ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో పుతిన్ సంయమనాన్ని పాటిస్తున్నట్లు అంచనా. ట్రంప్‌ను పూర్తిగా రష్యాకు వ్యతిరేకంగా మళ్లకుండా అడ్డుకోవడమే ప్రస్తుతం క్రెమ్లిన్ ప్రథమ లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్ 2026ను నాటకీయ శక్తి ప్రదర్శనతో ప్రారంభించారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణలతో అదుపులోకి తీసుకుని న్యూయార్క్‌కు తరలించారు. వెనెజువెలా తాత్కాలికంగా అమెరికా నియంత్రణలోకి వచ్చిందని ట్రంప్ ప్రకటించారు. ఈ చర్యను రష్యా ప్రభుత్వ మీడియాతో సంబంధం ఉన్న కొందరు విశ్లేషకులు… ‘‘మదురోను తొలగించడం రష్యా ప్రయోజనాలకు విరుద్ధం కాద’’ని వ్యాఖ్యానించడం గమనార్హం.
అమెరికా తన ప్రాబల్య ప్రాంతాల్లో ఈ విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ద్వారా… రష్యాకు కూడా తన పరిధిలో ఇలాంటి చర్యలకు అవకాశం కల్పించినట్లే అవుతుందని కొందరు క్రెమ్లిన్ అనుకూల వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం గత డిసెంబర్‌లో విడుదల చేసిన నూతన జాతీయ భద్రతా వ్యూహానికి ఇది ఆచరణాత్మక ఉదాహరణగా వారు పేర్కొంటున్నారు.

క్రెమ్లిన్‌కు సన్నిహితుడైన విదేశాంగ విధానాల నిపుణుడు ఫ్యోడోర్ లుక్యనోవ్‌…‘‘అంతర్జాతీయ సంబంధాల్లో శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ప్రాబల్య ప్రాంతాలు మళ్లీ కీలకంగా మారుతున్నాయి. ట్రంప్ థియరీ దీనిని స్పష్టంగా చూపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా తాజా ఆంక్షలు తాత్కాలికంగా అసౌకర్యాన్ని కలిగించినా, దీర్ఘకాలంలో రష్యాకు లాభదాయకమేనని ఎంపీ యెవ్‌గెనీ పాపావ్ అభిప్రాయపడ్డారు.

అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ‘మారినెరా’ అంశంలోనూ రష్యా సంయమనం పాటించింది. నౌకలోని సిబ్బందిని సురక్షితంగా విడిచిపెట్టాలని మాత్రమే డిమాండ్ చేసింది. ప్రతీకార చర్యలు, సైనిక హెచ్చరికలపై మాత్రం ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీనిపై కొందరు రష్యా రాజకీయ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా కోస్ట్ గార్డ్‌పై ప్రతీకార చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌మాన్ అలెక్సీ జురావ్లియోవ్ డిమాండ్ చేయడం కలకలం రేపింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం… పుతిన్ దృష్టిలో ప్రస్తుతం వెనెజువెలా కంటే యుక్రెయిన్‌ చాలా పెద్ద అంశం. ట్రంప్‌తో జరగాల్సిన డీల్‌లో యుక్రెయిన్ కీలకంగా ఉండటంతో… ఇతర అంశాలపై మౌనం వ్యూహాత్మకమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మౌనం తాత్కాలికమా? లేక అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు సంకేతమా? అన్నది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.