NewsTelangana

పాల్వాయి స్రవంతి దీటైన అభ్యర్థేనా..?

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడు, మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తెగా స్రవంతికి విజయావకాశాలు పెరుగుతాయన్నది అధిష్ఠానం అభిప్రాయం. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు, బీజేపీ తరఫున పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం పాల్వాయి స్రవంతికే టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. రియల్టర్‌ చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పట్టుబట్టినా.. పార్టీ అధిష్ఠానం సీనియర్ల మాటకే ప్రాధాన్యత ఇచ్చింది.

కుమ్ములాటలే కాంగ్రెస్‌ను కొంప ముంచుతాయా..?

నిజానికి.. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు సిట్టింగ్‌ నియోజక వర్గం. అంతేకాదు.. గతంలో ఎక్కువ సార్లు ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థే విజయం సాధించారు. అయితే.. ఈసారి ఆ పార్టీలో కుమ్ములాటలు, బలమైన క్యాడర్‌ కలిగి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌ విజయావకాశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పైగా.. రాజగోపాల్‌ సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై సందేహం నెలకొనడంతో స్రవంతి విజయం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీలో సీనియర్ల కుమ్ములాటలు.. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిపై వ్యతిరేకతే కాంగ్రెస్‌ కొంప ముంచుతాయా.. అనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లో నెలకొన్నాయి.

సీనియర్లను ఏకం చేసేందుకు స్రవంతి ప్రయత్నం

పాల్వాయి స్రవంతి మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను కలిసి మద్దతు కోరారు. తనకు టికెట్‌ ప్రకటించగానే స్రవంతి తొలుత ఇంటిని (కాంగ్రెస్‌ పార్టీని) చక్కదిద్దుకోవడంపై దృష్టి కేంద్రీకరించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలను కలిసి మద్దతు కోరాలని భావిస్తున్నారు. పార్టీ నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రజా క్షేత్రంలోకి వెళ్తే తన విజయం సులభమవుతుందని స్రవంతి భావిస్తున్నారు.

ముక్కోణపు పోటీ ఖాయం..

రాజగోపాల్‌ రెడ్డికి ఆర్థిక, అంగ బలం ఎక్కువ. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ప్రత్యేక కేడర్‌ను కొనసాగిస్తారు. రాజీనామా చేసి మరీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో విజయం కోసం ఆయన సర్వశక్తులూ ఒడ్డుతారనడంలో సందేహం లేదు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఇంకా ప్రకటించ లేదు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో 2014లో పాల్వాయి స్రవంతిని ఓడించిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ముందున్నారు. ఆయనకే టికెట్‌ ప్రకటిస్తే.. మునుగోడులో ముక్కోణపు పోటీ ఖాయంగా తెలుస్తోంది. మొత్తానికి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌.. మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.