సంపద కరవైందా? లేక లెక్కలతో చీకటి రాజకీయమా?
. ఆదాయం క్షీణించిందని ఆరోపణ
. వ్యయాలు భారీగా పెరిగాయా ?
. CAG నివేదిక ఆధారంగా విమర్శలు
. సంపద పెంపు అంటే ఇదేనా?
ఏపీలో ఆర్థిక పరిపాలనపై రాజకీయ చర్చలు మళ్లీ జోరందుకున్నాయి. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాష్ట్ర ఆదాయం తీవ్రంగా తగ్గిందని, ప్రభుత్వం సంపద సృష్టించడంలో విఫలమైందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జగన్ ట్విట్టర్ వేదికగా, గణాంకాలతో సహా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదికల ఆధారంగా తమ విమర్శలు వెల్లగక్కారు. “ఇదేనా సంపద పెంపు?” అంటూ ఎద్దేవా చేశారు. ఆయన చూపించిన లెక్కల ప్రకారం,ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో రాష్ట్ర స్వంత ఆదాయం వృద్ధి కేవలం 3.47% మాత్రమే. కేంద్ర నిధులతో కలిపినా మొత్తం వృద్ధి 6.14%లో పరిమితమైంది.అదే సమయంలో రాష్ట్ర ఖర్చులు ఏకంగా 15.61% పెరిగాయి.అయితే ఈ విమర్శలకు బలంగా ఎదురుదాడి చేస్తోంది అధికార కూటమి. సీఎం చంద్రబాబు పాలన దూరదృష్టితో సాగుతుందని, భవిష్యత్ తరం కోసం పెట్టుబడులను ఆకర్షించే వ్యూహంతో ముందుకెళ్తున్నారని స్పష్టం చేస్తోంది.“విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,ఐటీ, తయారీ, మౌలిక వసతుల రంగాల్లో భారీ ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. కాని వాటి ఫలితాలు వెంటనే కాక, మూడేళ్లు,ఐదేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి” అంటున్నారు.ఇప్పటి పరిస్థితి ఇలా ఉంది. అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉంది.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి. పింఛన్ల పెంపుతో సామాన్యులకు మద్దతు అందుతోంది.సింగపూర్‌లో పెట్టుబడుల కోసం సీఎం పర్యటిస్తున్నారు.అయితే, పెట్టుబడులు ఒప్పుకున్న వెంటనే ఆదాయం వచ్చేలా కాదని, ఉత్పత్తి మొదలైన తర్వాతే పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.