పిఠాపురం వర్మ ఫ్యాన్ గూటికి ?
కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తరువాత అక్కడ టీడీపీ తరపున నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న వర్మ. తన సీటు పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేయడమే కాదు.. దగ్గరుండి పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు వర్మ చేసిన కృషిని ఎవ్వరూ కదనలేరు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం వర్మతో అంతలా అనుబంధం కలిగి ఉంటుంది.పిఠాపురానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వర్మ ఒకసారి స్వంతంత్య్ర అభ్యర్థిగా మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాంటి వర్మపై పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కూటమిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో వర్మ ఉన్నారని అందుకే పక్కచూపులు చూస్తున్నారని ఆ ప్రచారం సారాంశం.వర్మ టీడీపీకి వీరాభిమాని. చంద్రబాబు, లోకేష్ అంటే ఎంతో ఇష్టం. అయితే పవన్ కల్యాణ్‌ను గెలిపించడంలో వర్మ పాత్ర లేదని ఎవరూ కాదనలేని నిజం. ఆ తర్వాత కూటమి ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. ఆయనకు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇంతవరకు చర్చకు రాలేదు. జనసేన నాయకులు ఆయనపై విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న ప్రచారం నిజమని నమ్మేవాళ్లు లేకపోలేదు.మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వర్మ వైసీపీలో చేరుతున్నారన్న ఆరోపణలు గందరగోళానికి తెరలేపాయి. నిజంగానే వర్మ టీడీపీను వదిలి వైసీపీలో చేరుతున్నారా.. అనే చర్చ కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు మొత్తం కాకినాడ జిల్లాలో సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో వర్మను కూటమి ప్రభుత్వం ఉపయోగించుకుని కరివేపాకులా తీసేస్తుందని, ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వలేదని, జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు ఇలా వర్మను పూర్తిగా అసంతృప్తిలోకి నెట్టాయని అంటున్నారు. ఈ కారణంతోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది విమర్శలతో ఆగకుండా పిఠాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో భారీగా తరలివచ్చిన వర్మ అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.వర్మ టిడిపికి రాజీనామా చేస్తున్నారని, వైసీపీలోకి చేరుతున్నారని వంటి కల్పిత వార్తలను ప్రచారం చేసి, ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా తప్పుడు వార్తలను ఇటీవల ప్రచారం చేశారు. పిఠాపురం టిడిపి నాయకులు ఈ తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో ఆధారం లేని వార్తలను ప్రచారం చేసి, వర్మ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.