హైదరాబాద్ క్రికెట్ సంఘానికి బాధ్యత లేదా?
ఇండియాలో క్రికెట్‌ను ఒక మతంలా ఆరాధిస్తాం. క్రికెటర్లను హీరోలో పోల్చుకొని… వారు బాగా ఆడినప్పుడల్లా సంబరాలు జరుపుకుంటాం. ఇండియా పలానా మ్యాచ్ లో బాగా గెలిచిందని.. పలానా క్రికెటర్ దుమ్మురేపారని పండుగ చేసుకుంటాం. కానీ కరోనా రెండేళ్ల తర్వాత క్రికెట్ వేడక ఇండియాలో ఊపందుకుంటున్న తరుణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA తీరు వివాదాలకు కారణమవుతోంది. ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్ అంటే ప్రేక్షకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలాంటి మ్యాచ్ నిర్వహణ విషయంలో HCA తీరు విమర్శలకు తావిస్తోంది. టికెట్ల అమ్మకం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ యువతి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో అటెన్షన్ అంతా HCAపై పడింది. కీలక మ్యాచ్ నిర్వహణ అసలు ఎలా చేస్తోందన్నదానిపై చర్చ మొదలైంది. టికెట్ల విక్రయం దగ్గర్నుంచి, స్టేడియం నిర్వాహణ వరకు అంతా ఆగమాగం చేసింది HCA. పట్టించుకునేవాడు లేడన్న చందంగా స్టేడియం నిర్వహణ ఘోరంగా మారింది. స్టేడియం అంతా కళావిహీనంగా మారిపోయింది. ఇక ప్రేక్షకులు కూర్చొనే సీట్లు పావురాల రెట్టలతో నిండిపోయాయి. మ్యాచ్ నిర్వహణ గురించి చాన్నాళ్ల కిందటే సమాచారం ఉన్నప్పటికీ HCA మాత్రం మొత్తం వ్యవహారాన్ని లైట్ గా తీసుకొంది. స్టేడియంలో 40 వేల మంది పట్టే అవకాశం ఉన్నా HCA అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పినట్టుగా మాత్రం లేదు. వాస్తవానికి ఇప్పటి వరకు 26,550 టికెట్లు అమ్ముడయ్యాయని చెబుతున్నా… మిగతా 13 వేలు ఏమయ్యాయన్నదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. మొత్తంగా అటు స్టేడియం నిర్వహణ, ఇటు టికెట్ల విక్రయం విషయంలో HCA నవ్వులపాలవుతోంది.


