Andhra PradeshHome Page Slider

టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమా!? రేపు గన్నవరంలో భేటీలో క్లారిటీ!

కృష్ణాజిల్లా గన్నవరంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన ఏపీ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. జాతీయ సహ సంఘటన మంత్రి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కేంద్రమంత్రి మురళీధరన్, రాష్ట్ర వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ దేవదర్, సహకేంద్ర, రాష్ట్ర నేతలతో పాటు జిల్లాల అధ్యక్షులు ఇన్చార్జులు పాల్గొంటున్న ఈ సమావేశంలో వివిధ కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో నెలరోజుల పాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం పై చేపట్టిన అభియోగాల నమోదు ఇతర పోరాట కార్యక్రమాలపై సమీక్షించనున్నారు.

గత భీమవరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని కూడా జాతీయ నేతలు సమీక్షించనున్నారు. ఇవన్నీ కూడా సాధారణ అంశాలు గానే భావిస్తున్న బీజేపీ నేతలు పొత్తులపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చితే పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ నేతల స్వరం మారిన నేపథ్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. రాష్ట్ర బీజేపీలో పొత్తులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల పొత్తులపై సమావేశంలో మరోసారి కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. జనసేనతో మాత్రమే తొలి నుంచి కూడా పొత్తు పెట్టుకునేందుకు కొందరు నేతలు ఆసక్తి చూపుతుండగా మరి కొందరు నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కూడా సానుకూల దృక్పథంతో ఉన్నారు.

పలు సందర్భాల్లో జనసేనతో పొత్తు అంటూనే తమ ప్రధాన పొత్తు ప్రజలతోనే అని సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కుండబద్దలు కొట్టారు. కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరిపై కూడా ఏపీ బీజేపీ నేతల్లో కొంత మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతున్న నేపథ్యంలో పొత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా సోము వీర్రాజు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.