సాగు నీరు పంటలకందివ్వడంలో విఫలం?
రేపల్లె: పంటల సాగుకు నీరందించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైనట్లేనని తెదేపా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేకా వెంకట శివరామకృష్ణ విమర్శించారు. వరి పంటకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రేపల్లె జలవనరుల కార్యాలయం ఎదుట గురువారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేయలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా అని ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పశ్చిమానికి సమృద్ధిగా సాగు నీరందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఖరీఫ్ సీజన్‌లోనే పూర్తిస్థాయిలో పంటల సాగుకు నీరు సరఫరా చేయకుంటే రబీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చిరుపొట్ట దశలో ఉన్న వరి చేలకు నీరు అందక పగుళ్లిచ్చి బీడువారుతున్న నేలలు. రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో సాగునీరందక వేలాదిమంది రైతులు పంటను రక్షించుకోలేక మదనపడుతున్నారని తెలిపారు. ప్రధాన కాలువల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని శివారు భూములకు అందేలా చర్యలు తీసుకోవడంలో జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శివారు పొలాలకు నీరందించేలా కృషి చేయాలని కోరారు. కార్యాలయ సిబ్బంది జానీబాషాకు వినతిపత్రం అందజేశారు. రైతు నాయకులు పిన్నిబోయిన వెంకట చింతారావు, కుదరవల్లి వెంకటేశ్వరరావు, వడ్డి లక్ష్మోజి, రేపల్లె సురేష్, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, అజయ్‌కుమార్, నాగేశ్వరరావు, ధర్మతేజ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.