‘పది నిమిషాల్లో ఐఫోన్ ఇంటికే’ ..బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్..
వినియోగదారులు ఐఫోన్ 16 కోసం క్యూలు కట్టనక్కరలేదని, కేవలం పది నిమిషాల్లో ఇంటికే పంపిస్తామని బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే నేటి నుండి టాటా గ్రూప్‌కు చెందిన నిత్యావసరాల సరఫరా యాప్ బిగ్ బాస్కెట్ ఈ సేవలను అందిస్తుందని తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల విభాగం క్రోమాతో కలిసి పనిచేయనుంది బిగ్ బాస్కెట్. మా కస్టమర్లు ఎలాంటి వెయిటింగ్ పిరియడ్ లేకుండా అత్యాధునిక టెక్నాలజీని అందుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబయిలలో మాత్రమే ఈ సేవలు అందిస్తామని, త్వరలోనే ఇతర నగరాలకు కూడా విస్తరిస్తామని తెలిపింది. బిగ్ బాస్కెట్ మాత్రమే కాకుండా బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 డెలివరీలు కేవలం పావుగంటలో చేస్తామని ఆఫర్ ఇచ్చింది. దీనికోసం యూనికార్న్ సోర్స్‌తో ఒప్పిందం చేసుకుంది. ఐఫోన్ 16 పై ఎలాంటి ఆఫర్లు లేకపోయినా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కొటక్ క్రెడిట్ కార్డులపై రూ. 5000 డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇవి విడుదల అవుతుండడంతో నేడు యాపిల్ స్టోర్ల ముందు వినియాగదారులు భారీగా క్యూలు కట్టారు.

