ఢిల్లీలోని అంతరాష్ట్ర బస్సు సర్వీసులు, రాకపోకలు బంద్
దేశరాజధాని ఢిల్లీ మహానగరంలో యమునానది వరద వ్యాపించి, వీధులు, రోడ్లన్నింటినీ ముంచెత్తుతోంది. తాజాగా నగరంలోనే అతిపెద్దదైన జాతీయ బస్ టెర్మినల్ మూతపడింది. కశ్మీర్ గేట్ వద్ద గల ఈ బస్సు టెర్మినల్ వరద కారణంగా తాత్కాలికంగా మూతపడింది. ఇక్కడకు బస్సుల రాకపోకలు నిలిపివేశారు. ప్రస్తుతం యమునా నది ప్రవాహం దాదాపు 209 మీటర్ల ఎత్తున పొంగిపొరలుతోంది. ప్రమాదస్థాయి కన్నా నాలుగు మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నందున సహాయక చర్యలు కూడా కష్టమవుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ తాజా నివేదిక ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద వాటర్ లెవెల్ 208.62 మీటర్లు ఉంది. ఇది ప్రమాద స్థాయి కంటే 3.29 మీటర్ల ఎత్తున ఉంది. గత 45 సంవత్సరాల క్రిందట 207.49 మీటర్ల రికార్డే ఇప్పటి వరకూ అత్యధిక వరద రికార్డు. ఇప్పుడు దీనిని మించిపోయిందని ఢిల్లీవాసులు అంటున్నారు.

