జహీరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి దిశగా కేంద్రప్రభుత్వం మరో మెగా ప్రాజెక్టును రాష్ట్రానికి కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా.. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనుంది. మొత్తం రెండు దశల్లో, దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. అటొమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు, రవాణా తదితర రంగాలకు ఊతం అందనుంది. దీంతోపాటుగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ద్వారా.. లక్షా 74వేల మందికి ఉపాధి లభించడంతోపాటుగా.. దాదాపు రూ.10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందాయి. తెలంగాణలోని జహీరాబాద్‌కు ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గానూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.