జీతాలు పెంచిన ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతో ఓ వైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఫ్రెషర్స్‌కు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లూ వెనక్కి తీసుకుంటున్నారు. ఉన్న ఉద్యోగాలూ తీసేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్‌లో రెండో అతిపెద్ద టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఉద్యోగులకు 10-13 శాతం వరకు వేతనాలు పెంచుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొంతమంది ఉద్యోగులకు 20-25 శాతం వరకూ పెంచినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిష్ శంకర్ తెలిపారు. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 28.4 శాతంగా ఉంది.

కాగ్నిజెంట్ ఉద్యోగులకు 10 శాతం పెంపుదల..
ఇన్ఫోసిస్‌లో ఐదేళ్ల క్రితం ఏడాదికి 8000-10000 మంది ఉద్యోగులు ప్రమోషన్ పొందేవారు. 2021-22లో కంపెనీ ఏడాదికి 40 వేల మందికి ప్రమోషన్లు కల్పిస్తోంది. దీంతో ప్లాటినం క్లబ్ ఆఫ్ టాప్ పర్ఫార్మర్స్ ద్వారా ఫ్రెషర్స్ నుంచి మేనేజర్ స్థాయికి చేరుకునే కాలాన్ని తగ్గిస్తున్నట్లు సంస్థ హెచ్ఆర్ హెడ్ క్రిష్ శంకర్ చెప్పారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 1-2 శాతం మంది ప్లాటినం క్లబ్లో ఉన్నారు. కాగ్నిజెంట్ కూడా తమ ఉద్యోగుల వేతనాలను 10 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. టీసీఎస్, విప్రో కంపెనీలు కూడా తమ ఉద్యోగుల వేతనాలను ఇటీవల పెంచాయి. అయితే.. కాగ్నిజెంట్‌లో అట్రిషన్ రేటు 31 శాతం ఉండటం విశేషం.

