హోరాహోరీ పోరులో పాక్‌పై భారత్ ఉత్కంఠ గెలుపు
ఆసియాకప్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఎవరు గెలుస్తారా అని విజయం చివరి వరకు దోబూచులాడింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమ్ ఇండియా.. పాకిస్తాన్ ను 147 పరుగులకే కట్టడి చేసినా… ఆ మాత్రం పరుగులు సాధించడానికి టీమ్ ఇండియా అష్టకష్టాలు పడింది. భారత్ టాప్ బ్యాట్స్‌మెన్ పేలవమైన ప్రదర్శనతో అభిమానులకు ఆందోళన కలిగించినా… హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా రాణించడంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమ్ ఇండియా బంపర్ విక్టరీ సాధించింది. మూడు బంతుల్లో ఆరు రన్స్ చేయాల్సిన తరుణంలో హార్దిక్ పాండ్య సిక్సర్ కొట్టి టీమ్ ఇండియాకు మధురమైన విజయాన్ని అందించాడు. దుబాయ్ లో జరిగిన ఆసియా కప్ కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన హార్దిక్ పాండ్య భారత్ కు విజయాన్ని అందించారు. అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ అన్న వెంటనే నెర్వస్ ఫీలవడం కామన్ గా మారిపోయింది. రాహుల్ సున్నాకే అవుట్ కాగా, రోహిత్ శర్మ 12 పరుగులు, కోహ్లీ 35 పరుగులకే అవుట్ అయ్యారు. ఫస్ట్ ఓవర్ లో కోహ్లీ డ్రాప్ కావడంతో ఈ పరుగులైనా సాధించాడు. టాప్ ఆటగాళ్లు అంతంతగానే రాణించడంతో ఒకానొక టైమ్ లో అసలు గెలుస్తామా లేదా అనుకున్న పరిస్థితి ఎదురయ్యింది. రవీంద్ర జడేజా క్రీజ్ లో నిలుచొని భారత్ కు చక్కటి విజయాన్ని అందించాడు. పాకిస్తాన్ బౌలర్ నషీమ్ తొలి మ్యాచ్ లోనే చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చివరి పది ఓవర్లలో భారత్ 86 పరుగులు చేయాల్సి వచ్చింది. సూర్యకుమార్ అవుట్ కావడంతో ఇండియా 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజ్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా సత్తా చాటారు. 18 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి రావడంతో అభిమానులు మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు.

(courtesy bcci twitter)
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.భువనేశ్వర్ కుమార్ 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొడటంతోపాటు, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 10 పరుగులకే అవుట్ అవడం వల్ల పాకిస్తాన్ 150 పరుగుల లోపు అలౌట్ అయ్యింది. ఓవైపు భువనేశ్వర్ ముందుగా టీమ్ ఇండియాకు మంచి ఆరంభం ఇవ్వగా.. హార్దిక్ పాండ్య 25 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. యువ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ 33 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ పది మంది ఆటగాళ్లు స్పీడ్ బౌలర్లకే అవుట్ కావడం కూడా విశేషం. పాకిస్తాన్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేయగా, ఇఫ్తికర్ అహ్మద్ 28 పరుగులు చేయడంతోపాటు, చివరి ఓవర్లో షహనవాజ్ దహానీ రెండు సిక్సర్లు కొట్టడంతో పాకిస్తాన్ జట్టు స్కోర్ 147 పరుగులకు చేరుకొంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా హార్థిక్ పాండ్యా ఎంపికయ్యారు.

(courtesy bcci twitter)
టీమ్ ఇండియా ప్రదర్శనకు ఫిదా అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు ఆకట్టుకుందని అభినందించారు. ఆసియా కప్ లో జట్టు ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుందని మోదీ కితాబిచ్చారు. పాకిస్తాన్ తో మ్యాచ్ విజయంపై భారత్ జట్టుకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్.
ఇక మ్యాచ్ ప్రసార హక్కులను సాధించిన హాట్ స్టార్ లో మ్యాచ్ ఫీవర్ స్పష్టంగా కన్పించింది. రాత్రి కోటి 30 లక్షల మందికి పైగా అభిమానులు లైవ్ లో మ్యాచ్ వీక్షించారు. 13 మిలియన్ల మంది ఇండియాలో వాచ్ చేస్తే, పాకిస్తాన్ లోని ఫేమస్ క్రికెట్ యాప్ దరాజ్ యాప్ లో క్రికెట్ మ్యాచ్ లైవ్ స్క్రీమింగ్‌ను 13 మిలియన్ల మంది వాచ్ చేశారు. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై అభిమానుల్లో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా యాప్ లోనే రెండు దేశాల్లో రెండు కోట్ల 60 లక్షల మంది భారత్-పాక్ మ్యాచ్ వీక్షించారంటే…క్రికెట్ ఇరుదేశాల్లో ఒక మతం అనడానికి ఇంతకన్నా రుజువు మరేముంటుంది.

