భారత్ జోడో యాత్రలో అపశృతి.. కాంగ్రెస్ నేతకు తీవ్ర గాయాలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగుతోంది. రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర ఇంధన శాఖ మాజీ మంత్రి నితిన్ రౌత్‌ను పోలీసులు నెట్టివేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. రౌత్‌ను హైదరాబాద్‌లోని వాసవి ఆసుపత్రిలో చేర్పించారు. కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం తెలంగాణ నుంచి పున:ప్రారంభించారు. రాష్ట్రంలో పార్టీ ప్రచారానికి ఇది ఎనిమిదో రోజు. గత వారం ప్రారంభమైన తెలంగాణ యాత్ర రాష్ట్రంలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తుంది, రాష్ట్రంలో మొత్తం 375 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది. నవంబర్ 4న యాత్ర ఒక రోజు విరామం తీసుకుంటుంది. నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తుంది.


 
							 
							