ఇండియా కూటమి ఇక ముక్కలైనట్లేనా…
ఇండియా కూటమి పార్టీలలో లుకలుకలు మొదలయ్యాయి. కూటమిలో చీలికలు మొదలయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో హవా చూపించిన ఇండియా కూటమి పార్టీలు అనంతరం జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో చతికిలపడ్డాయి. రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమి బలం పుంజుకోవడం లేదని, తనకు అవకాశమిస్తే నాయకత్వం వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందుకు వచ్చింది. దీనితో ఆమెకు మద్దతిచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన ఆమెకు మద్దతు తెలిపారు. ఇటీవల లాలూ తనయుడు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ కూడా మమతపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. దీనితో ఆమెకు మద్దతు పెరిగినట్లయ్యింది. అయితే ఇండియా కూటమిలో భాగస్వామి కాకపోయినా, వైసీపీ సైతం ఇటీవల మమతకు మద్దతునిచ్చింది. బీజేపీ ఏపీలో టీడీపీ కూటమిలో ఉండడంతో విపక్ష కూటమికి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయవేత్తలు అంటున్నారు. కూటమిలో అన్ని పార్టీలు నాయకత్వ మార్పుకు అంగీకరిస్తున్నట్లు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే ఇండియా కూటమి ఎంపీలతో సమావేశమైన రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలపై ఎవరూ తొందరపడి స్పందించవద్దని, పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ అన్ని విషయాలు చక్కదిద్దగలదని నచ్చచెప్పారు.