25వేల మంది ఉద్యోగులను సాగనంపిన భారత స్టార్టప్‌లు
84 స్టార్టప్‌ల నుంచి పాతికవేల మంది ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక సంక్షోభం దెబ్బకు భయపడుతున్న కంపెనీలు
ఉద్యోగుల తొలగింపుతో నష్టాలను పూడ్చుకోవాలని వ్యూహాలు
పరిహారంగా ఒక్కో ఉద్యోగికి రెండు నెలల వేతనం
భారతీయ స్టార్టప్‌లలో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. స్వదేశీ స్టార్ట్-అప్ కంపెనీలు.. అభివృద్ధి ఎంత వేగంగా ఉందో.. ఇప్పుడు ఆర్థిక నష్టాలతో ఊపిరాడక ఇబ్బందిపడుతున్నాయి. తక్షణం ఉపశమనంగా ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. దేశంలోని స్టార్టప్ కంపెనీలు… ఇప్పటివరకు 24,250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తొలిగించినట్టు ప్రముఖ స్టార్టప్ పోర్టల్ Inc42 పేర్కొంది. ఇప్పటి వరకు 84 స్టార్టప్‌లు 24,256 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ఆ సంస్థ వివరించింది. దేశంలో ఉద్యోగులను తొలగించే స్టార్టప్‌ల జాబితా అంతకంతకూ పెరుగుతోందని నివేదిక అభిప్రాయపడింది. ప్రముఖ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫార్మ్ ప్రాక్టో, ఫండింగ్ కొనసాగుతున్నందున, కంపెనీ నిరంతర పనితీరు నిర్వహణ, ప్రణాళిక ప్రక్రియలో భాగంగా 41 మంది ఉద్యోగులు… ఎక్కువగా ఇంజనీర్లను తొలగించింది.

కిరాణా డెలివరీ ప్రొవైడర్ Dunzo తాజా ఫండింగ్ రౌండ్‌లో $75 మిలియన్లను సేకరించి… వర్క్ ఫోర్స్‌లో కనీసం 30 శాతం మందిని, దాదాపు 300 మంది ఉద్యోగులను సాగనంపింది. నివేదికల ప్రకారం, బెంగళూరుకు చెందిన జెస్ట్‌మనీ 20 శాతం మంది ఉద్యోగులు, 100 మందిని ఇంటికి పంపించాలని కంపెనీ నిర్ణయించింది. హోమ్‌గ్రోన్ ఫాంటసీ ఇ-స్పోర్ట్స్ స్టార్టప్ ఫ్యాన్‌క్లాష్ తన వర్క్‌ఫోర్స్‌లో 75 శాతం మందిని తొలగించింది. Inc42 ప్రకారం, స్టార్టప్ కంపెనీలు… మూడు రౌండ్లలో సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులందరికీ రెండు నెలల వేతనాన్ని పరిహారంగా కంపెనీలు అందించాయి. గత నెల చివర్లో, అన్ అకాడెమీ సహ వ్యవస్థాపకుడు, CEO గౌరవ్ ముంజాల్ సైతం తమ కంపెనీలో ఉద్యోగులను 12 శాతం మేర తగ్గించుకోవడం, లేదా 350 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

వీటితోపాటు దేశంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన అనేక కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను ఇంటికి పింపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. వాటిలో బైజూస్, ఓలా, ఓయో, మోషో, ఎంపీఎల్, లైవ్ స్పేస్, ఇన్నోవేకర్, ఉదాన్, అనెకాడమీ, వేదాంతు మొదలైన సంస్థలున్నాయి. ఇంటీరియర్స్, రినోవేషన్ ప్లాట్‌ఫార్మ్ లివ్‌స్పేస్ ఇటీవల ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా కనీసం 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్‌లైన్ స్టోర్‌ల కోసం సాస్ ప్లాట్‌ఫార్మ్ దుకాణ్, దాదాపు 30 శాతం ఉద్యోగులను లేదా దాదాపు 60 మంది ఉద్యోగులను తొలగించింది. ఆరు నెలల్లో రెండోసారి ఉద్యోగులపై వేటు వేసింది. హెల్త్‌కేర్ సంస్థ, యునికార్న్ ప్రిస్టిన్ కేర్ 350 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా తాజా ఉద్యోగుల క్రమబద్ధీకరణ… సేల్స్, టెక్, ప్రొడక్ట్ టీమ్‌ల నుండి ఎక్కువగా జరుగుతోంది. ఆన్‌లైన్ ఉన్నత విద్యా సంస్థ అప్‌గ్రాడ్ దాని అనుబంధ సంస్థ “క్యాంపస్”లో దాదాపు 30 శాతం ఉద్యోగులను తగ్గించుకొంది.