మనుషుల్లో దేవుడు, రతన టాటా జీవితచక్రం
భారతదేశం అత్యంత గౌరవనీయ వ్యాపారవేత్తలలో ఒకరైన రతన్ టాటా బుధవారం రాత్రి 11.30కు మరణించారు. ఆయనకు 86 ఏళ్లు. టాటా సన్స్ ఛైర్మన్‌గా వ్యవహరించడమే కాక సాయం చేయడంలోనూ ప్రపంచ ఖ్యాతి పొందాడు. టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్‌సెట్‌జీ టాటా మునిమనవడు రతన్ నావల్ టాటా. డిసెంబర్ 28, 1937న ముంబైలో నావల్ టాటా, సూని టాటా దంపతులకు జన్మించాడు. 1948లో అమ్మానాన్న విడాకులు తీసుకున్న తర్వాత అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగాడు. నాలుగు సార్లు పెళ్లి చేసుకోవావాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన పెళ్లి చేసుకోలేదు. లాస్ ఏంజెల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని ఒకసారి చెప్పిన రతన్ టాటా, 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా, ప్రియురాలిని ఇండియా పంపించేందుకు నిరాకరించడంతో ఆ పెళ్లి జరగలేదు. 1961లో కెరీర్‌ను ప్రారంభించిన రతన్ టాటా టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పని ప్రారంభించాడు. అప్పుడే నాయకత్వ లక్షణాలు టాటా గ్రూప్‌కు తెలిశాయి.

1991లో టాటా స్టీల్ ఛైర్మన్ అయ్యాడు. వందేళ్ల క్రితం తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్‌కు 2012 వరకు నాయకత్వం వహించాడు. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ జరుగుతున్న సమయంలో టాటా గ్రూపును పునర్వ్యవస్థీకరించాడు. టాటా నానో, టాటా ఇండికాతో సహా ప్రముఖ కార్ల వ్యాపార విస్తరణలో కీలక భూమిక పోషించాడు. టెట్లీని కొనుగోలు చేసి టాటా టీని, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను తీసుకొని టాటా మోటార్స్ విస్తృతం చేశాడు. 2004లో కోరస్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేసేలా చేశాడు. 2009లో, ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును మధ్యతరగతి వారికి అందుబాటులోకి తెస్తానని రతన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చాడు. టాటా నానో, ₹ 1 లక్ష రూపాయలకు అందించి పేదోడు కారు కొనేందుకు వీలు కల్పించాడు. రిటైరయ్యాక టాటా సంస్థ అన్ని గ్రూపులకు ఎమిరిటస్ ఛైర్మన్ హోదాను పొందాడు.