భారత బాలికకు బ్రిటన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు
భారత సంతతికి చెందిన ఏడేళ్ల బాలిక మోక్షారాయ్కు బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డునిచ్చి సత్కరించింది. ఈమెకు బ్రిటన్ ‘ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్’ అవార్డును అందించారు బ్రిటన్ ఉప ప్రధాని ఆలివర్ డౌడెన్. మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమంలో మోక్షారాయ్ తన నాలుగేళ్ల వయస్సు నుండే స్వచ్చందంగా పని చేస్తోంది. ఆర్థిక అవసరాలున్న చిన్నారుల కోసం నిధుల సేకరణ చేస్తోంది. అంతేకాక సుస్థిరాభివృద్ధి సాధించే లక్ష్యాల దిశగా పలు కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మోక్ష బ్రిటన్ ప్రభుత్వ గుర్తింపును పొందింది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధిని గురించి పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చడానికి చాలా కృషి చేసిందని, ఈ విషయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలతో కూడా సంప్రదింపులు జరిపిందని మెచ్చుకున్నారు బ్రిటన్ ఉప ప్రధాని ఆలివర్ డౌడెన్.ఆమె చదివే పాఠశాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా వినియోగించకుండా తన చుట్టూ ఉన్నవారిని మార్చిందని పేర్కొన్నారు. భారత్‌లో కూడా నిరుపేద పిల్లలకు విద్యనందించడానికి కృషి చేస్తోందని వివరించారు.

మోక్ష కూడా ఈ అవార్డు అందుకోవడంపై చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఈ భూమి ఎంతో అద్భుతమైనదని, దీనిపై నివసిస్తున్న మనందరం కలిసి దీనిని కాపాడుకోవాలని కోరుకున్నారు. ‘మనం మన దంతాలు నొప్పి లేకుండా ఎంత జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటామో మన భూమిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలతో, వాయు కాలుష్యాలతో నింపకూడదని’ పేర్కొన్నారు చిన్నారి మోక్ష.

