ఇజ్రాయెల్‌కు మద్దతుగా హమాస్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులతో విరుచుకు పడిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, ఆర్మీని పొట్టన పెట్టుకున్న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులకు భారత్ హ్యాకర్ల బృందం గట్టి దెబ్బ కొట్టింది. తెర ముందు భయంకరమైన యుద్ధం జరుగుతుంటే, తెరవెనుక సైబర్ దాడులు, హ్యాకింగులు జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులకు కొన్ని దేశాలు సపోర్టుగా నిలుస్తుంటే, ఇజ్రాయెల్‌కు మరికొన్ని దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. భారత్ కు చెందిన హ్యాకర్ల బృందం పాలస్తీనా హమాస్‌కు చెందిన కీలకమైన వెబ్‌సైట్లను హ్యాక్ చేసింది.

పాలస్తీనాకు ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన హ్యాకర్లు మద్దతుగా నిలిచారు. ఓపీఇజ్రాయెల్, ఓపీఇజ్రాయెల్2 అనే పేర్లతో మిస్టీరియస్ టీమ్‌ల పేరుతో బంగ్లాదేశ్, సూడాన్, పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను హ్యాక్ చేయడానికి ప్రయత్నించాయి. కానీ అప్పటికే జియో లాకింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ఇండియన్ సైబర్ ఫోర్స్ అనే పేరుతో భారత్ హ్యాకర్ల బృందం ఇజ్రాయెల్‌కు మద్దతుగా, పాలస్తీనాకు సంబంధించిన ప్రభుత్వ, అధికారిక వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, షాకిచ్చింది. పాలస్తీనా వెబ్ మెయిల్ ప్రభుత్వ సర్వీస్, పాల్సతీనా జాతీయ బ్యాంక్ వెబ్‌సైట్, పాలస్తీనా టెలి కమ్యూనికేషన్ కంపెనీలతో పాటు హమాస్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్లు కూడా హ్యాక్ చేసినట్లుగా ట్విటర్ (ఎక్స్) లో ప్రకటించింది ఇండియన్ సైబర్ ఫోర్స్.

