InternationalNews

నేడు శ్రీలంకతో తలపడనున్న భారత్..గట్టెక్కుతుందా?

ఆసియా కప్ కోసం ఎన్నో ఆశలు..మరెన్నో అంచనాలతో బరిలోకి దిగింది భారత్.  ఈ నేపథ్యంలో ఆసియా గ్రూప్ కప్‌లో భారత్ పాకిస్థాన్ ,హాంకాంగ్‌పై వరుస విజయాలను సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. అయితే ఇప్పడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.  దీనికి ప్రధాన కారణం సూపర్ 4లో భారత్ పాక్ చేతిలో పరాజయం పొందటమే. ఈ ఓటమి భారత్ జట్టు గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

భారత్ ఇప్పడు టైటిల్ పోరులో నిలవాలంటే ఈ సూపర్ 4లో 2వ మ్యాచ్ మరింత కీలకం కానుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌లో భారత్ శ్రీలంకను ఢీ కొట్టాల్సివుంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు చావోరేవో లాంటిది. అయితే ఈ సూపర్ 4లో ఒక్కో జట్టు ..మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడాల్సి ఉంటుంది. దీంట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ సూపర్ 4 లో ఇప్పటికే భారత్‌పై పాక్,ఆఫ్ఘనిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించాయి. దీంతో ఫైనల్లో నిలవాలంటే భారత్ ఎట్టి పరిస్థితులలో లంక పై విజయం సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి ఇటువంటి అత్యంత ప్రాముఖ్యమైన మ్యాచ్‌లో భారత్ ఈ రోజు శ్రీలంకతో ఎలా తలపడుతుందో వేచి చూడాల్సివుంది.