Breaking NewsHome Page Sliderhome page sliderNational

భారత్ టూర్ రద్దు – అలెర్టైన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి రద్దయింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కారణంతో , భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ ఏడాదిలో నెతన్యాహు భారత సందర్శన రద్దుకావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత ఈ ఏడాది పర్యటించాలనుకోగా పలు కారణాలతో రద్దవుతూ వస్తోంది. సెప్టెంబర్ 9న ఆయన ఇండియాకు రావాల్సి ఉడగా, అయితే అక్కడ బిజీ షెడ్యూల్ ఉండటంతో ఆయన రాలేకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావాల్సి ఉండగా ,ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా మరోసారి నెతన్యాహు పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఏడాదిలో నెతన్యాహు భారత్‌లో పర్యటించే అవకాశాలు దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవచ్చు . 2026లో ఆయన పర్యటన ఉండేలా ప్రణాళికలు రూపోందిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత ప్రధాని మోదీ 2017లో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2018 జనవరిలో నెతన్యాహు భారత్‌ను సందర్శించారు. దాంతో రెండు దేశాల ప్రధానుల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.