త్వరలో భారత్ బంగారం ధరలు నిర్ణయిస్తుంది
ఢిల్లీ : వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో గోల్డ్ మైనింగ్ కీలక పాత్ర వహించబోతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజనల్ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ గనుల తవ్వకంతో ప్రపంచంలో బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ ఎదుగుతుందన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఎక్కువ మొత్తం భారత దేశంలో బంగారం ఉన్నా..గోల్డ్ బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రైస్ టేకర్ గా ఉన్నామన్నారు. ప్రస్తుతం లండన్ ఏఎం, పీఎం బెంచ్ మార్క్ ధరలను అనుసరిస్తున్నామని, ఆర్బీఐ, బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులతో త్వరలోనే భారత్ ధరలు నిర్ణయించే స్థాయికి చేరుకుంటామని సచిన్ జైన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లలో భారత్ ప్రపంచ జ్యూవెలరీ హబ్ గా మారనుందన్నారు. ప్రపంచ స్థాయికి ఎదగాలంటే సోర్సింగ్, మార్కెటింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరం అని, వచ్చే దశాబ్ద కాలంలో దేశ బంగారు అవసరాలను సొంత గనులే తీర్చనున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

