యోగవిద్యకు పుట్టిల్లు భారతదేశం-ప్రపంచానికే దిక్సూచి
నేడు జూన్ 21నాడు ప్రపంచవ్యాప్తంగా యోగాదినోత్సవం జరుపుకుంటున్నాము. భారతప్రధాని నరేంద్రమోదీ కోరిక మేరకు 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అంగీకరించింది. దీనితో 2015 జూన్ 21 నుండి ప్రపంచవ్యాప్తంగా దీనిని అమలు పరుస్తున్నారు. దేశప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శుభాకాంక్షలు అందజేస్తున్నారు. మోదీ సంకల్పంతో రూపొందిన ఈ యోగా డేని ఇప్పుడు 190 దేశాలలో జరుపుకుంటున్నారు.

ఈ యోగా అనేది శరీర వ్యాయామమే కాదు మానసికోల్లాసాన్ని కూడా కలిగిస్తుంది. ప్రాణాయామం, ఆసనాల ద్వారా శరీరం సులువుగా తగిన భంగిమలలో ఏర్పడుతుంది. శరీరదారుఢ్యం పెరుగుతుంది. శ్వాస సంబంధమైన సమస్యలు దూరమవుతాయి. పరిపూర్ణ ఆరోగ్యాన్ని యోగ సాధన, యోగాసనాల ద్వారా పొందవచ్చు. సరైన జీవన విధానానికి యోగా మంచి మార్గంగా దారి చూపుతుంది. కోపం, ఉద్రేకం, అసహనం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ యోగవిద్య ఈనాటిది కాదు. అనాది కాలం నుండి ప్రాచీన రుషులు దీన్ని రూపొందించారు. వారు ఆచరించి దీర్ఘకాలం ఏ వ్యాధులూ లేకుండా జీవించి చూపించారు. నేడు ఐక్యరాజ్యసమితిలో జరగనున్న యోగా కార్యక్రమానికి భారత ప్రధాని మోదీ నేతృత్వం వహించనున్నారు. ప్రధాని యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఒక గ్లోబల్ మూవ్‌మెంట్‌గా మారిందన్నారు. దేశ ప్రజలనుద్దేశించి తన సందేశాన్ని ట్విటర్‌లో అందించారు.

