కేజ్రీవాల్ అరెస్ట్, వ్యాఖ్యలపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. కేజ్రీవాల్ అరెస్టు, విచారణకు సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అంతకు ముందు జర్మనీ కూడా స్పందించింది. అయితే భారత ప్రభుత్వం అందుకు తగిన విధంగా స్పందించింది తాజాగా అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యలపై న్యూఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌తో సమావేశమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నివేదికలను పర్యవేక్షిస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెప్పిన ఒక రోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు “న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూల న్యాయ ప్రక్రియ” ఉండేలా చూడాలని న్యూఢిల్లీకి అమెరికా పిలుపునిచ్చింది. ఐతే MEA అధికారులు, గ్లోరియా బెర్బెనా మధ్య జరిగిన సమావేశం వివరాలు తెలియాల్సి ఉంది.

courtesy: ani
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర భారతీయ పౌరుల మాదిరిగానే కేజ్రీవాల్ కూడా న్యాయమైన, నిష్పాక్షిక విచారణకు అర్హులని జర్మనీ విదేశాంగ కార్యాలయం నొక్కిచెప్పిన కొద్ది రోజుల తర్వాత అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వ్యాఖ్యలు వచ్చాయి. “న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలు ఈ కేసులో కూడా వర్తిస్తాయని భావిస్తున్నాం, ఆశిస్తున్నాము” అని జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. జర్మన్ రాయబారిని పిలిపించి, ఇండియా అంతర్గత విషయాలలో జోక్యం వద్దని పేర్కొంది. దేశ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా అలాంటి వ్యాఖ్యలను చూస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

