ప్రపంచంలో ఇప్పుడు భారతే నెంబర్‌వన్
ప్రపంచంలోనే భారత జనాభా ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. ఇంతవరకూ మొదటిస్థానంలో ఉన్న చైనాను దాటి శరవేగంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత భారత జనాభా 142.86 కోట్లు. చైనా జనాబా 142.57 కోట్లుగా ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం ఈరోజే ప్రకటించింది. అంటే చైనా కంటే 29 లక్షల మందికి పైగా జనాభాను భారత్ కలిగి ఉంది. 1950 వ సంవత్సరం నుండి UNO ఈ జాబితాను ప్రకటించడం మొదలు పెట్టింది. జనాభా అంచనాలకు ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు -2023’ అనే పేరుతో UNO తాజా నివేదికను వెల్లడించింది. ప్రపంచ జనాభా 804.5 కోట్లు ఉండగా అందులో చైనా, ఇండియాలలో మాత్రమే మూడవ వంతు జనాభా ఉంది. 2011 నుంచి భారత జనాభా ప్రతీ సంవత్సరం సుమారుగా 1.2 శాతం పెరుగుతూ వస్తోంది.

చైనాలో గత అరవై ఏళ్లలో తొలిసారిగా గత సంవత్సరం జనాభా క్షీణించింది. ఈ పెరుగుదల సామాన్యుల్లో ఆందోళన కలుగజేస్తోందని UNFPA భారత ప్రతినిధి ఆండ్రియా వోజ్నార్ పేర్కొన్నారు. కానీ దేశాభివృద్ధిలో జనాభా కీలకపాత్ర పోషిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్నట్లు మనదేశంలో మనుషులు ఎక్కువగా ఉండడం, పనిచేసే వయస్సులో ఉండడం గొప్పవిషయం. విస్తీర్ణంలో ప్రపంచంలో 7 వస్థానంలో ఉన్న భారత్, జనాభా విషయంలో మాత్రం మొదటి స్థానానికి చేరుకుంది. ఈ జనాభా అవసరాలకు తగినన్ని వనరులు, ఆదాయం సమకూర్చాలంటే ప్రభుత్వాలకు విషమపరీక్షే.

