InternationalNews

మాంద్యానికి భారత్‌ దూరం..!

ఆర్థిక మాంద్యంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు విలవిల్లాడుతున్నా.. భారత్‌లో మాత్రం ఆ ఛాయలేవీ కనిపించడం లేదు. గతంలోనూ అమెరికాలో తలెత్తిన మాంద్యం భారత్‌కు శుభపరిణామంగా మారింది. అమెరికాలో ఆర్థిక మాంద్యంతో ముడిచమురు ధరలు పతనమవుతాయి. దీంతో భారత్‌ చెల్లింపుల బ్యాలెన్స్‌ మెరుగవుతుంది. మన దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే పరిస్థితి లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టం చేశారు. మన దేశం చాలా వేగంగా అభివృద్ధి సాధిస్తోందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయన్నారు. చాలా దేశాల కంటే మన ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందన్నారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ ఆరో స్థానానికి దిగజారింది. భారత్‌ ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రపంచ ఆర్థిక మాంద్యంతో భారత్‌కు మేలు జరుగుతోందనడానికి ఇదే నిదర్శనం.

మన మార్కెట్టే మనకు బలం..

భారత్‌ చేపడుతున్న సంస్కరణలు, పెట్టుబడులకు ప్రోత్సాహం, అతిపెద్ద దేశీయ మార్కెట్‌ వల్లే దేశంలో మాంద్యం ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అంతేకాదు.. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలు మందగమనంలో ఉంటే భారత్‌ వృద్ధి రేటు 7 శాతం నమోదైంది. 2023-24లో 6.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిజానికి మన మార్కెట్టే మనకు బలం. భారత్‌లో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ అంత సునాయాసంగా పతనం కాదు. అందుకే భారత్‌కు మరో రెండేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశమే లేదు. ప్రపంచ మాంద్యంలోనూ భారత్‌లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనం. అయితే.. ప్రపంచ దేశాల ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్‌పై ఎంతోకొంత పడుతుంది. ఆయా దేశాల్లో ధరల పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు వంటి చర్యలతో భారత విదేశీ మారక ద్రవ్యంపై ప్రభావం పడుతుంది.

ప్రపంచ మాంద్యం ప్రభావం పడదు..

ప్రపంచం ఆర్థిక మాంద్యంలో మునిగినా దాని ప్రభావం భారత్‌పై అంతగా ఉండదని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా అన్నారు. దేశంలో అభివృద్ధికి ఢోకా లేదని.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ఎగుమతులు ఎక్కువగా చేసే దేశాలతో పోలిస్తే భారత స్టాక్‌ మార్కెట్‌లో హెచ్చు తగ్గులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు మెరుగ్గా ఉంటుందని.. ఈ ఏడాది 6.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ కారణం కాదన్నారు. ఇది సప్లయ్‌ ఆధారిత ద్రవ్యోల్బణం అని చెప్పారు. ద్రవ్యోల్బణానికి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కూడా మరో కారణమన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత ఆర్థిక వ్యవస్థ అంతగా ముడిపడిలేదని.. అందుకే అమెరికా, ఐరోపా దేశాల్లోని మాంద్యం ప్రభావం భారత్‌పై పడదని ప్రముఖ ఆర్థిక వేత్త పాల్‌ ఎఫ్‌ గ్రుయెవాల్డ్‌ చెప్పారు. భారత్‌లో కావాల్సినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయన్నారు. అమెరికా మాత్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణాన్ని ఎందుర్కొంటోందన్నారు.

భారత్‌లో గతంలో నాలుగుసార్లు మాంద్యం..

భారత్‌ గతంలో నాలుగుసార్లు (1958, 1966, 1973, 1980) ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. 1958లో దిగుమతి బిల్లులు భారీగా పెరగడంతో తొలిసారి మాంద్యంలోకి వెళ్లింది. 1965లో తీవ్రమైన కరువు వల్ల భారత వృద్ధి రేటు నెగెటివ్‌లోకి వెళ్లింది. 1972లో అరబ్‌-ఇజ్రాయిల్‌ యుద్ధంలో ఇజ్రాయిల్‌కు అండగా నిలిచిన దేశాలకు అరబ్‌ దేశాలు చమురు దిగుమతులను నిలిపివేశాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధర 400 శాతం పెరిగి భారత్‌ వృద్ధి రేటు మైనస్‌ 0.3గా నమోదైంది. 1980లో ఇరాన్‌ విప్లవం వల్ల చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా చమురు దిగుమతుల బిల్లు రెట్టింపు అయి మన వృద్ధి రేటు మైనస్‌ 5.2గా నమోదైంది.