తొలిసారిగా తాలిబన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు..
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌కు ఆఫ్గానిస్తాన్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తాలిబన్ ప్రభుత్వంలోని తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో, భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ ఫోన్‌లో చర్చలు జరపడం ఆసక్తి కలిగించింది. ఎందుకంటే తాలిబన్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారత్ ఎన్నడూ వారితో చర్చలు జరపలేదు. పహల్గాం ఉగ్రదాడిని ఆఫ్గాన్ ఖండించడాన్ని తాము స్వాగతిస్తున్నామని జై శంకర్ తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత్ ప్రయోగించిన మిస్సైల్ ఆఫ్గాన్ భూభాగంలో పడిందంటూ పాకిస్తాన్ వదంతులు సృష్టించింది. దానిపై కూడా తాలిబన్ స్పందించింది. తమ భూభాగంపై భారత్ క్షిపణులు ఏమీ పడలేదని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. 2021లో ఆఫ్గాన్‌లో తాలిబన్ పాలన ఏర్పడిప్పటి నుండి ఆ ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించలేదు. కానీ దుబాయ్ వేదికగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. ఆఫ్గాన్ మంత్రితో జైశంకర్ చర్చలు జరిపినా అక్కడి ఆల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రమూకల సంచారంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.