International

థాయ్‌లాండ్‌పై టీమిండియా బౌలర్ల విజృంభణ- సులభంగా సెమీస్‌కి

మహిళల ఆసియా కప్ క్రికెట్ టీ20 టోర్నీలో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. పసికూన థాయ్‌లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 15.1 ఓవర్లకు థాయ్ జట్టు కేవలం 37 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలిపోయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా విజయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 8 పరుగులకే ఔటైంది. అయితే తెలుగమ్మాయి సబ్బినేని మేఘన 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. తోడుగా పూజా వస్త్రాకర్ 12 పరుగులు జోడించి టీమిండియాను గెలిపించారు. దీంతో భారత్ కేవలం 6 ఓవర్లలో ఒక్కవికెట్‌ను మాత్రమే కోల్పోయి, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న భారత్ టీమ్‌లో స్పిన్నర్లు స్నేహ్ రాణా(3/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/8), దీప్తి శర్మ(2/10) ధాటికి ప్రత్యర్థి బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. థాయ్ జట్టులో ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగిలిన అందరూ సింగిల్ నంబరు స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ఈ విజయంతో భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆడి 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్ అక్టోబరు 13న జరుగనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సెమీస్‌లో మూడు బెర్తులు ఆక్రమించగా, నాలుగో స్థానం కోసం బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ పోటీ పడనున్నాయి.