NationalNews

పెరిగిన ద్రవ్యోల్బణం.. ధరాఘాతం తప్పదా..

ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. రెండేళ్ల పాటు పీడించిన కరోనా లాక్‌డౌన్‌ దెబ్బకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కంపెనీలు మూతబడ్డాయి. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలే కాదు.. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉపాధి కోసం ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. రానున్న కాలంలో ఈ సంక్షోభం మరింత ముదురుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

7 శాతానికి పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 7 శాతానికి పెరిగింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధి జూలైలో 2.4 శాతానికి పరిమితమైంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా పెరిగితే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇలా రిటైల్‌ ద్రవ్యోల్బణం దేశంలో వరుసగా 8 నెలల నుంచి కొనసాగుతోంది. దీంతో ధరలు పెరిగే ప్రమాదం నెలకొంది.

కూరగాయల ధరలు పెరిగాయి..

జూలైలో 6.69 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో 7.62 శాతానికి చేరింది. ఫలితంగా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పాదరక్షలు, ఇంధన ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు మాత్రం తగ్గాయి. గోధుమలు, బియ్యం, మైదా తదితర నిత్యావసర వస్తువుల ఎగుమతిపై ఆంక్షలు విధించడం ద్వారా ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గతంలోనూ వంట నూనెలు, పప్పు ధాన్యాల ఎగుమతిని నిషేధించడంతో దేశీయంగా సరఫరా పెరిగి ధరలు తగ్గాయి. ఇక పారిశ్రామిక వృద్ధి గత నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. తయారీ, విద్యుత్తు, గనుల రంగాల్లో పని తీరు ఆశించిన స్థాయిలో లేదు.

రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు..

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచాయి. వంట నూనెల ధరలు రెట్టింపు అయ్యాయి. వంట గ్యాస్‌ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాల ధరలూ మధ్య తరగతి, పేద ప్రజలు కొనలేని స్థితికి చేరాయి. ధరలు పెరుగుతున్నంత వేగంగా సామాన్య ప్రజల ఆదాయం పెరగలేదు. దీంతో వారి కొనుగోలు శక్తి భారీగా క్షీణించింది. ఏదైనా కొనాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. కొవిడ్‌ తర్వాత దేశంలో నిరుద్యోగం కూడా భారీగా పెరిగింది. ఈ ఆర్థిక మందగమనాన్ని ప్రపంచం తప్పించుకోవడం కష్టమని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్‌ మల్పాస్ అన్నారు.