Home Page SliderInternationalNational

ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (బీబీసీ) ఢిల్లీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు ఎకౌంట్స్ బుక్స్ మాత్రమే చెక్ చేస్తున్నారని… సోదాలు చేయడం లేదని ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ముంబై, ఢిల్లీ రెండు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. లండన్‌కు చెందిన కంపెనీ కార్యాలయానికి ఐటీ అధికారులు రావడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీపై భారీ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బీబీసీ కార్యాలయానికి రావడం ఆసక్తిగా మారింది. బిబిసి ప్రమేయం ఉన్న అంతర్జాతీయ పన్నులు, ఇతర అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై ఆదాయపన్ను శాఖ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు జర్నలిస్టుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

“ఇండియా: ది మోడీ క్వశ్చన్” అనే రెండు భాగాల సిరీస్‌పై BBC ఇటీవల వార్తల్లో నిలిచింది. జనవరి 21న, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించి, వివాదాస్పద డాక్యుమెంటరీకి లింక్‌లను షేర్ చేసే మాధ్యమాలు యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. సోదాలకు కొన్ని గంటల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీని విమర్శించారు. వేల కుట్రలు సత్యానికి హాని కలిగించలేవని… సత్యం సూర్యుడిలా ప్రకాశిస్తుందని… 2002 నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని… ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతిసారీ, మోదీ బలంగా, నిజాయితీగా వ్యవహరించి మరింత ప్రజాదరణ పొందారన్నారు.