గవర్నర్‌గా మూడేళ్లల్లో ..అన్ని అవమానాలే: తమిళిసై
తెలంగాణా గవర్నర్‌గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె తెలంగాణా ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణా ప్రభుత్వం తనను అవమానిస్తుందని వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నది ప్రజల కోసమేనన్నారు . రాజ్ భవన్ ఏమైనా అంటరానిదా అని ప్రశ్నించారు. యూనివర్శిటి సమస్యలపై సీఎంకు లేఖ రాశానన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఇంకా పనిచేస్తూనే ఉంటానని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకే వెళ్తానని స్పష్టం చేశారు. తనకు గౌరవం ఇచ్చినా.. ఇవ్వకపోయిన పట్టించుకోనని చెప్పారు. తాను ప్రజల వద్దకు వెళ్లడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నానన్నారు. మహిళ గవర్నర్ అయినప్పటికీ నాపై వివక్ష చూపించారన్నారు. తెలంగాణాలో జరిగే సమక్క-సారక్క జాతరకి కారులో 8 గంటలు ప్రయాణం చేసి వెళ్లానన్నారు. గిరిజనులకు మద్దతు ఇవ్వడానికే ఆ జాతరకు వెళ్లానని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

తెలంగాణాలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ జరుగుతోంది. తాను ఎట్ హోంకు పిలిచినా ఎవరూ రాలేదన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ పరిస్థితులను చూసి చలించి పోయానన్నారు. రాష్ట్రంలో గవర్నర్ ప్రోటోకాల్‌ను ఎవరూ పట్టించు కోవడం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాల టైంలోనూ గవర్నర్ పై వివక్ష చూపించారన్నారు. ఇలా బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. సదరన్ కౌన్సిల్ భేటికీ సీఎం ఎందుకు హాజరుకాలేదో చెప్పాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరేడ్‌లు ఉన్నాయి..కానీ తెలంగాణాలో ఎందుకు లేదు అని గవర్నర్ ప్రశ్నించారు. తెలంగాణా గవర్నర్ కు మాత్రమే కొవిడ్ నుంచి రక్షణ కావాలా? తనను అవమానించడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. సర్వీస్ కోటా కాబట్టే కౌశిక్ ఫైల్ తిప్పి పంపించానన్నారు. ఒక ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడం దేనికి సంకేతమన్నారు. నేను ఎవరిపై ద్వేషంతో మాట్లాడడం లేదన్నారు.