మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు రూ. 40 వేలు
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలన్న ఆరాటంతో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ దుబ్బాక ఉపఎన్నికలో ఓటుకు రూ. 10 వేలు, హుజురాబాద్ ఉపఎన్నికలో రూ. 20 వేలు పంచారని బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు ఏకంగా రూ. 40 వేలు ఇవ్వబోతున్నారని చెప్పారు. తమకు అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకుని.. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. 15 మంది మంత్రులు, 86 ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపించడాన్ని చూస్తుంటే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్‌లో ఉన్నారో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవిష్యత్తు మునుగోడు ఉపఎన్నికతోనే ముడిపడి ఉందని బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటామని బండి సంజయ్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయంగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. కొత్త రోడ్లు మంజూరు అవుతున్నాయి. గొర్లకు డబ్బులొస్తున్నాయి. ఇన్నాళ్లుగా దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇవ్వాలని అడిగితే ఏనాడూ కేసీఆర్ పట్టించుకోలేదు. ఎన్నికలు రాగానే అన్నీ ఇస్తామని ఆశపెడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి తమ కోసమే రాజీనామా చేశారని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీనే భారీ మెజార్టీతో గెలుస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.