పొత్తుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు మొదలైన కొత్త టెన్షన్
35-45 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలను అడుగుతున్న జనసేన
పొత్తులో బీజేపీ కూడా కలిస్తే ఆ పార్టీకి కొన్ని స్థానాలు కేటాయింపు
ఇప్పటికే నియోజకవర్గాల్లో పట్టు పెంచుకున్న తమ్ముళ్లకు సీటు గండం
త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ..సీట్ల సర్దుబాటు పై చర్చ
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలతో కొన్ని నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ నేతలు కలవరానికి గురవుతున్నారు. పొత్తుల అంశంపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయటంతో కొన్ని నియోజకవర్గాల్లోని నేతలు తమ సీటు విషయంలో టెన్షన్ పడుతున్నారు. జనసేన ఎక్కడెక్కడ టికెట్లు ఆశిస్తుందో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వారున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం హుషారును పెంచింది. జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే అధికారం ఖాయమన్న ఆలోచనలలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా జనసేన అధినేత చేసిన ప్రకటనపై సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. షరతులు లేకుండా పొత్తులకు వెళ్తామని అయితే ఎవరికి లొంగేది లేదని పవన్ స్పష్టం చేయటం తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సంతృప్తిపరిచింది.

ఇంకోవైపు భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచే అవకాశాలను కూడా మార్గం సుగమం అయ్యే పరిస్థితి ఉండటంతో మరింత బలంగా ముందుకు వెళ్లాలన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పంపకాలే మిగిలాయన్న అభిప్రాయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. దాదాపు 40 అసెంబ్లీ స్థానాలతో పాటు ఏడు పార్ల మెంట్ జనసేన పార్టీ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులో భాగమైతే ఆ పార్టీకి కొన్ని స్థానాలను కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రభావం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలపై పడనుంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. జనసేన ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చేందుకు మెగ్గుచూపుతున్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పొత్తుల ప్రభావం అధికంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొంతమేర రాయలసీమలో చూపనుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో అధిక సీట్లను జనసేన ఆశిస్తోంది. దీనికి సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీ అధినేతలు త్వరలోనే మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే మూడుసార్లు చర్చలు జరిపి నిర్వహించి పొత్తులపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చిన ఇరు పార్టీల అధినేతలు కర్నాటక ఫలితాలు వెలువడిన అనంతరం మరోసారి చర్చలు జరపాలని భావిస్తున్నారు. త్వరలోనే వీరిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులపై సీట్ల సర్దుబాటు పై నిర్ణయం తీసుకున్నఅనంతరం మహానాడు వేదికగా కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వనుంది. మరి పొత్తుల నేపథ్యంలో ఏయే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతల సీట్లు గల్లంతవుతాయా చూడాలి.

