Home Page SliderTelangana

తెలంగాణలో అక్కడ మాత్రం  రెండుసార్లు ‘బతుకమ్మ సంబరం’

తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలను రాష్ట్రమంతటా చాలా వేడుకగా, సంబరంగా జరుపుకుంటారు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఈ పండుగను రెండుసార్లు వైభవంగా జరుపుకుంటారు. అది తెలంగాణలోని జగిత్యాల జిల్లా, వరంగల్ హసన్ పర్తి మండలం సీతంపేట గ్రామం. ఇక్కడ బతుకమ్మ సంబరాలు రెండుసార్లు జరుగుతాయి. మామూలుగా రాష్ట్రమంతటా జరిగే బతుకమ్మవేడుకలతో పాటు దీపావళి పండుగ నుండి మూడు రోజుల పాటు మళ్లీ బతుకమ్మ సంబురాలు చేస్తారు. పంటలు బాగా పండాలని, జనం సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇలా ఉత్సవాలు చేస్తామని సీతంపేట ఊరి ప్రజలు చెప్తున్నారు. ఈ మూడురోజుల్లో మొదటి రోజు గంగస్నానాలు చేసి, రేగడి మట్టితో జోడెడ్ల బొమ్మలు తయారు చేస్తారు. చివరి రోజున బతుకమ్మ నిమజ్జనంతో ఈ వేడుకలు పూర్తవుతాయి. ఇలాగే జగిత్యాలలో మహిళలు అమ్మగారింట్లో, అత్తగారింట్లో రెండుచోట్లా పండుగను చేస్తారు. దీనికోసం వీరు దసరాకు ఒకరోజు ముందు బతుకమ్మ పండుగను చేస్తారు. ఈ జిల్లాలోని జగిత్యా, మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, వంటి మండలాలలో ఒకరోజు ముందే వేడుక జరుగుతుంది. రాయికల్, మేడిపల్లి, కోరట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ వంటి మండలాల్లో దసరా అనంతరం ఈ పండుగను జరుపుకుంటారు.

బతుకమ్మ అనగానే రంగురంగుల పూలతో కూర్చిన పూల బంతులు గుర్తొస్తాయి. తెలంగాణ రాష్ట్రపుష్పం తంగేడును మొదటగా ఈ బతుకమ్మలో పేరుస్తారు. పసిడి రంగులో మెరిసిపోయే ఈ తంగేడు పూలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పూలతో టీ చేసుకుని తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కీళ్లనొప్పులకు, శరీరఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా ఈ పూలు పనిచేస్తాయి. మందారం, పాండవుల పువ్వు, తామర పువ్వు బీరపువ్వు, రుద్రాక్ష పూలు, గునుగు పూలు, గుమ్మడి, చామంతి, బంతి పూలతో అందంగా వరుసలో పేర్చి తయారు చేస్తారు  ఈ పూల బతుకమ్మలు. మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మల చూట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటారు. ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రకటించింది తెలంగాణ. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా 13 రోజుల పాటు పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.