Home Page SliderTelangana

‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే’…కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్ రెడ్డి

ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజిలో గత ముఖ్యమంత్రి కుటుంబమే ఇళ్లపట్టాలు తీసుకున్నారని, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఉందని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  అసెంబ్లీ సమావేశాల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.  మిడ్ మానేరు ముంపు బాదితులకు కేసీఆర్ ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజిలో ఇళ్లపట్టాలు ఇస్తానని మాట ఇచ్చారని, ఆ వూరి అల్లుడినంటూ వారి ఓట్లు వేయించున్నారని, కానీ అధికారంలో ఉన్న పదేళ్లలో అక్కడి ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఎద్దేవా చేశారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనన్నారు రేవంత్ రెడ్డి. తన బంధువులకు, మిత్రులకు ఈ ఇళ్లపట్టాలు ఇచ్చారని, తన బంధువైన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఆయన సోదరీమణి పేదవారా అని వారికి ఎందుకు ఈ ప్యాకేజిలో ఇళ్ల పట్టాలు తీసుకోవలసి వచ్చిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబమే పేదలకివ్వాల్సిన పట్టాలు కాజేశారని, వారికి ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. సభా సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించినా సరే వారిని, సస్పెండ్ చేసేది లేదని, వారు సభలో ఉండి యధార్థాలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.