మహారాష్ట్రలో ఘోరం, బస్సు లోయలో పడి 12 మంది మృతి
శనివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పాత ముంబై-పూణే హైవేపై ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు. 27 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. సాంప్రదాయ సంగీత బృందం సభ్యులతో కూడిన ప్రైవేట్ బస్సు పూణె నుండి ముంబైకి వెళ్తుండగా తెల్లవారుజామున 4:50 గంటలకు హైవేపై షింగ్రోబా ఆలయం సమీపంలో ఉన్న లోయలో పడిపోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ముంబైలోని గోరేగావ్ నుండి ‘బాజీ ప్రభు వాదక్ గ్రూప్’ సభ్యులు బస్సులో ప్రయాణిస్తున్నారు. పూణె జిల్లాలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఒక కార్యక్రమంలో పాల్గొని గోరేగావ్‌కు తిరిగి వస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 1 గంటలకు బస్సు వేదిక నుండి బయలుదేరింది. క్షతగాత్రులను ఖోపోలి గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులేనని అదనపు ఎస్పీ అతుల్ జెండే తెలిపారు. స్థానిక పోలీసుల బృందం, ట్రెక్కర్ బృందం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందని పోలీసులు తెలిపారు. ఖోపోలి పట్టణం ముంబైకి 70 కి.మీ దూరంలో ఉంది.